West Bengal: పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ వర్సెస్ సీఎంగా రాజకీయం కొనసాగుతోంది. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, సీఎం మమతా బెనర్జీకి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌పై దుష్ప్రచారం చేయడంపై ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులపై కేంద్రం క్షమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు కేంద్ర అధికారి ఒకరు తెలిపారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌తో పాటు కోల్‌కతా సెంట్రల్ డీసీసీ ఇందిరా ముఖర్జీపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ ఇద్దరు కూడా పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకులుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ గవర్నర్ సీవీ ఆనందో బోస్ నివేదిక సమర్పించిన తర్వాత కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంది.
జూన్ నెలాఖరులో కేంద్ర హోం మంత్రికి గవర్నర్ నివేదిక సమర్పించారు. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకాండలో బాధితులను అనుమతి ఉన్నప్పటికీ గవర్నర్‌ని కలిసేందుకు అడ్డుకున్నారని నివేదికలో పేర్కొంది. రాజ్‌భవన్‌లో నియమించబడిన పోలీస్ అధికారులు, ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో ఒక మహిళా ఉద్యోగి గవర్నర్‌పై చేసిన ఆరోపణల్ని ప్రోత్సహిస్తున్నారని గవర్నర్ ఆరోపించారు. ఈ అధికారులు తమ చర్యల ద్వారా గవర్నర్ కార్యాలయానికి కళంకం తీసుకువచ్చినట్లు నివేదిక పేర్కొంది. గవర్నర్ కార్యాలయం నుంచి అభ్యంతరాలు ఉన్నప్పటికీ, రాజ్ భవన్ సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయడం, ఎంట్రన్స్-ఎగ్జిట్‌లను తనఖీ చేయడం వంటి కొత్త పద్దతులను కోల్‌కతా పోలీసులు తీసుకువచ్చినట్లు నివేదికలో ప్రస్తావించారు.
Read Also: Hathras stampede: ప్రజలపై విషం చల్లారు.. తొక్కిసలాట ఘటనపై భోలే బాబా లాయర్..
పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల నుంచి హింసాత్మక ఘటనల్లో బాధితులుగా ఉన్న వారు ప్రతిపక్ష నేత సువేందు అధికారితో కలిసి గవర్నర్ బోస్‌ని కలిసేందుకు వచ్చినప్పుడు పోలీసులు అడ్డుకోవడం, వారిని అదుపులోకి తీసుకోవడం గవర్నర్ రాజ్యాంగ అధికారాన్ని అవమానించడమే అని నివేదికలో పేర్కొన్నారు. గవర్నర్‌ని కలవడానికి బాధితులు కోర్టుని ఆశ్రయించాల్సి రావడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర అధికారి అన్నారు. జూన్ 13న రాజ్ భవన్ నుండి పోలీసు బృందాన్ని తొలగించాలని బోస్ ఇచ్చిన ఆదేశాలపై కోల్‌కతా పోలీసులు మౌనం వహించడాన్ని ఆదేశాలనను ధిక్కరించినట్లుగా చూపబడిందని అధికారి తెలిపారు. గవర్నర్‌కి తెలియకుండా కోల్‌కతా పోలీసులు ఏకపక్షంగా సెక్యూరిటీ మెకానిజంని ఏర్పాటు చేశారని అధికారి వెల్లడించారు.
రాజ్ భవన్ మహిళా ఉద్యోగి తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ముందస్తు స్కిప్టులో భాగమే అని బోస్ తన నివేదికలో పేర్కొన్నారు. అసాధారణమైన వేగంతో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారని, ఇది గవర్నర్ క్రిమిన్ ప్రొసీడింగ్ ఎదుర్కోనగలడనే తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించడానికి మీడియా సమావేశాలను కొనసాగించారని నివేదిక పేర్కొంది.గోయల్ మరియు ముఖర్జీలపై చర్య తీసుకోవాలని కోరుతూ బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఆమె కార్యాలయం నుండి ఎటువంటి సమాచారం లేదు.
