Site icon NTV Telugu

Havana Syndrome Case: భారత్‌లో హవానా సిండ్రోమ్‌ .. దర్యాప్తుకు కేంద్రం కమిటీ

Havana Syndrome

Havana Syndrome

Havana Syndrome Case: హవానా సిండ్రోమ్‌ వ్యాధిపై ఇండియాలో కూడా కొంత ఆందోళన ఉంది. భారత్‌లో ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి దేశంలో ఉందా? లేదా? అనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ.. అనుమానాలు, ఆందోళన మాత్రం ఉంది. దేశంలో హవానా సిండ్రోమ్‌ వ్యాధి వ్యాప్తి, నిర్మూలన చర్యలపై దర్యాప్తు జరపాలంటూ బెంగళూరుకు చెందిన అమర్నాథ్‌ చాగు అనే వ్యక్తి కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించారు. విచారణ సమయంలో కేంద్ర ప్రభుత్వం తన స్పందన తెలియజేసింది. దేశంలో హవానా సిండ్రోమ్‌పై వివరాలు తెలుసుకోవడం కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని.. సిండ్రోమ్‌ ఉనికికి సంబంధించి దేశంలో ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తామని కోర్టుకు తెలిపింది. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని హైకోర్టుకు కేంద్రం తెలిపింది. అమెరికాతో పాటు పలుదేశాల అగ్ర నేతలు, దౌత్యకార్యాలయ అధికారులను హవానా సిండ్రోమ్ కలవరపెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్‌లోనూ ఈ మిస్టరీ సిండ్రోమ్‌ ప్రభావం ఉందా? అన్న విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Read also: Gayathri Gupta: ఛీఛీ.. భర్తకు విడాకులిచ్చి.. ఇలాంటి పనులు చేస్తున్నావా.. ?

హవానా సిండ్రోమ్‌ అంటే ఏమిటంటే.. అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారులతో పాటు వివిధ దేశాల దౌత్యకార్యాలయ అధికారులకు ఎదురైన మానసిక ఆరోగ్య లక్షణాలనే హవానా సిండ్రోమ్‌గా గుర్తించారు. ఈ సిండ్రోమ్‌కు గురైన వారిలో బయట ఎటువంటి శబ్దం లేకున్నప్పటికీ.. భారీ శబ్దం వినిపించడం, మైగ్రెయిన్ బాధ, వికారంగా ఉండటం, జ్ఞాపకశక్తి మందగించడం, మైకం కలగడం వంటి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ సిండ్రోమ్‌ను మొదట క్యూబాలోని హవానా నగరంలోని అమెరికా దౌత్యకార్యాలయం సిబ్బందిలో గమనించారు.. కాబట్టే ఈ వ్యాధికి అదే నగరం పేరుమీదుగా దీన్ని హవానా సిండ్రోమ్‌గా పిలుస్తున్నారు. హవానా సిండ్రోమ్‌ లక్షణాలకు కచ్చితమైన కారణాలు ఇప్పటివరకు గుర్తించలేకపోయినప్పటికీ.. ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచి వచ్చే మైక్రోవేవ్ తరంగాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోందని అమెరికా అనుమానిస్తోంది. భారీ శబ్దాలను విడుదల చేసే పరికరాలు, అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన ధ్వని తరంగాలు ఇందుకు కారణం కావొచ్చని కొందరు చెబుతున్నారు. మరికొంతమంది నిపుణులు మాత్రం హిస్టీరియా లేదా మానసిక వ్యాధికారణాల వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Exit mobile version