NTV Telugu Site icon

Mamata Banerjee: శ్రీరామ నవమిని జరుపుకోండి.. కానీ ముస్లిం ఏరియాలకు దూరంగా ఉండండి

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమిని జరుపుకునే భక్తులు దయచేసి ముస్లిం ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. రామ నవమి ఊరేగింపులను శాంతియుతంగా జరుపుకోవాలని ఆమె అభ్యర్థించారు. రంజాన్ జరుగుతున్నందున ముస్లిం ప్రాంతాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా పండగ జరుపుకోవాలని, హింసను సృష్టించవద్దని కోరారు. ఊరేగింపుల్లో కత్తుల, చాకులతో వస్తామని కొందరు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, అయితే ఇది క్రిమినల్ నేరం అని మర్చిపోవద్దని, కోర్టులు మిమ్మల్ని విడిచిపెట్టవని హెచ్చరించారు.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీపై జర్మనీ వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై కేంద్రమంత్రుల విమర్శలు..

కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా త్రుణమూల్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న రెండు రోజుల ధర్నాలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. బీజేపీ సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తోందని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాలను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. మన జీఎస్టీ సొమ్మును దోచుకుంటున్నారని, 100 రోజుల కూలీ డబ్బును ఆపేస్తున్నారని, వారు మమ్మల్ని దేశవ్యతిరేకులు అంటున్నారని, వారికి మాత్రమే దేశభక్తి ఉందని, వారే జాతీయవాదులని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

2002 గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ.. బీజేపీ పార్టీ ‘ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్’గా ప్రవర్తిస్తుందని విమర్శించారు. బెంగాల్ లో మారణహోమం జరుగుతుందని బీజేపీ ఆరోపిస్తోందని, అయితే నిజమైన మరణహోమం గోద్రాలో, బిల్కిస్ బానో విషయంలో, ఢిల్లీలో జరిగిందని ఆరోపించారు. కేంద్ర సంస్థల ద్వారా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడాన్ని దీదీ తప్పుపట్టారు. బీజేపీకి ఎవరైనా ఎదురుమాట్లాడితే ఈడీ, సీబీఐని పంపుతున్నారని విమర్శించారు. బీజేపీని దుర్యోధనుడు, దుశ్శాసనుడితో పోల్చింది. బీజేపీని గద్దె దించడానికి ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని కోరారు.