CDS Anil Chauhan: త్రివిధ దళాధిపతి, సీడీఎస్ అనిల్ చౌహాన్ 1962 ఇండియా-చైనా యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో భారత వైమానిక దళాన్ని ఉపయోగించి ఉంటే కథ వేరుగా ఉండేదని అన్నారు. వైమానిక దళం ఉపయోగించడం వల్ల చైనా దాడి తగ్గేదని చెప్పారు. వైమానిక దళాన్ని ఉపయోగించడం ఉద్రిక్తతల్ని పెంచడం అవుతుందని కొందరు భావిస్తారు, కానీ ఆపరేషన్ సిందూర్ సమయంలో అలా జరగలేదని నిరూపితం అయిందని అనిల్ చౌహాన్ బుధవారం అన్నారు.
63 ఏళ్ల క్రితం చైనాతో జరిగిన యుద్ధం గురించి ఆయన మాట్లాడుతూ.. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లకు పార్వర్డ్ పాలసీని ఒకే విధంగా వర్తించడం తప్పు అవుతుందని చెప్పారు. అనేక సంవత్సరాలుగా యుద్ధాల ముఖ చిత్రం మారిపోయిందని, భద్రతా పరిస్థితులు, భౌగోళిక స్వరూపాలు, రాజకీయ పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. పూణేలో దివంగత లెఫ్టినెంట్ జనరల్ SPP థోరాట్ ఆత్మకథ ‘‘రెవిల్లే టూ రిట్రీట్’’ విడుదల కార్యక్రమానికి సంబంధించి, వీడియో సందేశంలో అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు. చైనా-భారత యుద్ధానికి ముందు లెఫ్టినెంట్ జనరల్ థోరాట్ తూర్పు కమాండ్‌కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు.
Read Also: AP Politics : ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో సూపర్ సిక్స్ పథకాలపై వేడివేడి వాదనలు
1962 ఎయిర్ ఫోర్స్ వాడితే గణనీయమైన ప్రయోజనం ఉండేదని సీడీఎస్ అన్నారు. అయితే, అప్పటి ప్రభుత్వం దీనికి అనుమతించలేదు, లెఫ్టినెంట్ జనరల్ థోరాట్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉపయోగించడంపై ఆలోచించారని అన్నారు. ఎయిర్ ఫోర్స్ ఉపయోగించడం వల్ల చైనా దాడిని పూర్తిగా నిరోధించకపోయినా, వారి దాడిని తగ్గించే అవకాశం ఉండేది, ఆ సమయంలో మన సైన్యాన్ని సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం దొరికేది అని అన్నారు. అయితే, ఆ రోజుల్లో వైమానిక దళాన్ని ఉపయోగించడం ఉద్రిక్తల్ని పెంచడంగా భావించే వారని, ఇది నిజం కాదని తాను భావిస్తు్న్నానని, ఆపరేషన్ సిందూర్ ఇందుకు ఉదాహరణ అని అనిల్ చౌహాన్ చెప్పారు.