NTV Telugu Site icon

Mohalla Clinics: కేజ్రీవాల్‌కి కొత్త చిక్కు.. ఆప్ “మొహల్లా క్లినిక్‌ల”పై సీబీఐ విచారణకి ఆదేశం..

Kejriwal

Kejriwal

Mohalla Clinics: ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కొత్త చిక్కు ఎదురైంది. ఆప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్‌ల పనితీరులో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్‌లలో జరిగి రోగనిర్ధారణ పరీక్షల్లో అవినీతి జరిగిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని కేంద్రం కోరినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి.

Read Also: Auto Drivers Begging: ఫ్రీ సర్వీసులతో ఉపాధి కోల్పోయాం.. బస్సుల్లో ఆటో డ్రైవర్ల భిక్షాటన

మొహల్లా క్లినిక్ పేరుతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక హెల్త్ ప్రోగ్రాం చేపట్టింది. అయితే ఈ ఆస్పత్రుల్లో ఎలాంటి పేషెంట్లు లేకుండానే నకిలీ రేడియాలజీ, పాథాలజీ పరీక్షలు నిర్వహించాయనే ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా సెప్టెంబర్ 20న ఈ విషయాన్ని ప్రస్తావించారు. మొహల్లా క్లినిక్స్‌లో పనిచేస్తున్న ఏడుగురు వైద్యుల్ని తొలగించారు. కొంతమంది ఆస్పత్రులకు రాకున్నా హాజరు అవుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాసిరకం మందులు సరఫరా అవుతున్నాయని కొద్ది రోజుల క్రితం ఎల్‌జీ వీకే సక్సేనా సీబీఐ చేత విచారించాలని ఆదేశించారు. మొహల్లా క్లినిక్ కేసులో, క్లినిక్‌లకు రాని వైద్యులు ఉన్నారని గుర్తించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. క్లినిక్‌లు లేని రోగులకు రోగనిర్ధారణ పరీక్షలను సూచిస్తూనే ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్ పేరుతో ఇంటి వద్దే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందించేందుకు ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇది అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటోంది.