Site icon NTV Telugu

Birbhum: బీర్భూమ్‌ ఘటనలో కీలక పరిణామం..

పశ్చిమ బెంగాల్‌లో బీర్భూమ్‌ జిల్లా బోగ్‌టూయి గ్రామంలో జరిగిన సామూహిక సజీవదహనాల అంశం కీలక మలుపు తిరిగింది. బెంగాల్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినా… ఘటన తీవ్ర దృష్ట్యా రాష్ట్ర పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలేరని అభిప్రాయపడింది కోల్‌కతా హైకోర్టు. నిజానిజాలను వెలికి తీసే బాధ్యతను సీబీఐకి అప్పగించింది. సామూహిక సజీవదహనాలపై సమగ్ర దర్యాప్తు చేసి… ఏప్రిల్‌ 7వ తేదీలోగా తమకు నివేదిక ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేసింది కోల్‌కతా హైకోర్టు. కేసుకు సంబంధించిన పత్రాలతో పాటు అదుపులోకి తీసుకున్న నిందితులను సీబీఐకి అప్పగించాలని సిట్‌ అధికారుల్ని ఆదేశించింది. ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్ లాబొరేటరీకి ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది కోల్‌కతా హైకోర్టు. ఫోరెన్సిక్‌ నిపుణుల బృందాన్ని బోగ్‌టూయి గ్రామానికి పంపి… అవసరమైన నమూనాలను సేకరించాల్సిందిగా సూచించింది. హైకోర్టు ఆదేశాలతో త్వరలోనే గ్రామానికి వెళ్లనున్నారు ఫోరెన్సిక్‌ నిపుణులు.

Read Also: Yogi Cabinet: పక్కా ప్లాన్‌తో యోగి కొత్త కేబినెట్.. ముస్లిం నేతకు చోటు

బీర్భూమ్‌ ఘటనపై సుమోటోగా విచారణ ప్రారంభిస్తూనే ఘటనా స్థలంలో సాక్ష్యాలు తారుమారుకాకుండా చర్యలు చేపట్టింది కోల్‌కతా హైకోర్టు. బోగ్‌టూయి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి… అక్కడ ఏం జరుగుతోంది? ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు… అనే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా రికార్డు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ని ఆదేశించింది. ఇక, కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ చేపట్టింది. నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడానికి సీనియర్ సీబీఐ అధికారులు మరియు ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన బృందాన్ని పంపినట్టు ఓ అధికారి తెలిపారు.. ఏప్రిల్ 7లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పూర్తి ఆధారాలను సేకరించేపనిలో పడింది సీబీఐ.. మరోవైపు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్ర పోలీసు అధికారులు లేదా రాష్ట్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ విషయంలో తదుపరి విచారణను నిర్వహించదు.

Exit mobile version