NTV Telugu Site icon

Lok Sabha Elections 2024: యానిమేటెడ్ వీడియో వివాదం.. జేడీ నడ్డా, అమిత్ మాల్వీయాపై కేసు నమోదు..

Jp Nadda

Jp Nadda

Lok Sabha Elections 2024: కర్ణాటకలో బీజేపీ రూపొందించిన యానిమేటెడ్ వీడియో ఒకటిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయాపై కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన రిజర్వేషన్లనున ముస్లింలకు కేటాయిస్తున్నారనే ఇతివృత్తం ఆధారంగా ఈ వీడియోను రూపొందించారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముస్లింలకు పెద్ద ఎత్తున నిధుల్ని అందిస్తున్నట్లు చూపిస్తున్న ఈ వీడియోను బీజేపీ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

మే 4న, శనివారం నాడు బీజేపీ కర్ణాటక యూనిట్ ట్వీట్ చేసిన 17 సెకన్ల యానిమేటెడ్ వీడియోలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కాదని ముస్లింలకు ఎక్కువ నిధులు ఇస్తున్నట్లుగా సూచిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ లీగర్ యూనిట్ టీమ్ సభ్యుడు రమేష్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి నడ్డా, విజయేంద్ర, అమిత్ మాల్వీయాలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ వీడియోకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది.

Read Also: Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కీలక వ్యాఖ్యలు..

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి రామలింగా రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి ఇంగితజ్ఞానం లేదని.. వారి అగ్రనాయకత్వం కూడా అలాంటిదేనని.. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో హిజాబ్, అజాన్, హలాల్ ప్రయోగించారని, అవి సఫలం అవ్వలేదని, ఇప్పుడు వారు మంగళసూత్రం గురించి మాట్లాడుతున్నారరి, ఈసారి వారికి రెండు అంకెల సీట్లను కూడా గెలవని అన్నారు. దీనిపై బీజేపీ నేత అమిత్ మాల్వీయా స్పందిస్తూ.. కాంగ్రెస్ తన హామీలను తానే చెప్పుకోవడం లేదని, వారి మానిఫెస్టోను బీజేపీ ప్రచారం చేస్తున్నందుకు కాంగ్రెస్ కృతజ్ఞతలు చెప్పాలని ఎద్దేవా చేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించేందుకు అంగీకరించడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం మొదలైంది. దీంతో ఇరు పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. కాంగ్రెస్ మానిఫెస్టోని బీజేపీ ముస్లింలీగ్‌తో పోల్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లిం కోటాను అంగీకరించేది లేదని ఇటీవల ప్రధాని స్పష్టం చేశారు.