India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో మొదలైన కెనడా, ఇండియా వివాదం ఇంకా ముగియడం లేదు. తాజాగా మరోసారి కెనడా, భారత్‌ని కవ్విస్తూ ఆ దేశ ప్రజలకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. కెనడా, భారత్ నుంచి తన 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్న గంటల వ్యవధిలో కెనడా విదేశాంగ శాఖ ఈ సూచనలను చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా తీవ్రవాద ముప్పు ఉన్నందున భారత్ లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కెనడా ఆ దేశ పౌరులనున హెచ్చరించింది.
ఇదే కాకుండా బెంగళూర్, ముంబై, చండీగఢ్ కాన్సులేట్ లో వ్యక్తిగత సేవలను నిలిపివేసింది. ట్రావెల్ అడ్వైజరీలో ఏదైనా సహాయం కావాలంటే న్యూఢిల్లీలోని కెనడా హైకమిషన్ ని సంప్రదించాలని సూచించింది. ఉగ్రవాదం, తిరుగుబాటు ప్రమాదం కారణంగా అస్సాం, మణిపూర్‌లకు అనవసరమైన ప్రయాణాన్ని నివారించాలని కోరింది. జమ్మూ కాశ్మీర్‌తో పాటు పాకిస్తాన్‌తో సరిహద్దు పంచుకునే మూడు రాష్ట్రాలకు ప్రయాణాలను నివారించాలని కోరింది. జమ్మూకాశ్మీర్ ప్రాంతానికి అన్ని ప్రయాణాలను నివారించండని సూచించింది. ఈ ప్రాంతంలో తీవ్రవాదం, మిలిటెన్సీ, పౌర అశాంతి, కిడ్నాప్ ముప్పు పొంచి ఉందని తెలిపింది.
Read Also: Gold Shop Robbery: దొంగతనం దాగేనా..? అక్కడ తప్పించుకున్నా..ఇక్కడ పట్టుకున్నారు
దీంతో పాటు చండీగఢ్, ముంబై, బెంగళూర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో అధిక జాగ్రత్త వహించాలని భారత్ లోని కెనడా పౌరులకు సూచించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో కెనడియన్లపై బెదిరింపులు, వేధింపులు జరగవచ్చని ఈ ప్రాంతాల్లో అపరిచితులతో తక్కువగా మాట్లాడాలని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని కెనడా సూచించింది.
ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతలోని గురుద్వారా వద్ద ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్లు ఉన్నారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదం అయింది. అయితే ఈ వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని ధ్వజమెత్తింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య తీవ్ర దౌత్యవివాదం జరుగుతూనే ఉంది.