NTV Telugu Site icon

S Jaishankar: “కెనడా తీవ్రవాదానికి ఆశ్రయం ఇస్తోంది”.. అమెరికాకు తేల్చిచెప్పిన జైశంకర్

Jaishankar

Jaishankar

S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడి నేతలతో సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం ఇండియా-కెనడాల మధ్య తీవ్ర దౌత్యవివాదం చెలరేగుతున్న సమయంలో జైశంకర్ యూఎస్ పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) ఉగ్రసంస్థ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసింది.

ఇదిలా ఉంటే ‘‘కెనడా తీవ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తోంది’’ అని జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ముందు కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారుతోందని భారత విదేశాంగ శాఖ గత వారం అభివర్ణించిన తర్వాత, తాజాగా జైశంకర్ కూడా కెనడాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెనడాలో తీవ్రవాద అంశాల విషయంలో భారత్ తన ఆందోళనలను అమెరికాకు తెలియజేసిందని జైశంకర్ అన్నారు.

హింసను బహిరంగంగా సమర్థించే ఉగ్రవాదానికి, తీవ్రవాదానికి కెనడా అనుమతించే వైఖరి కలిగి ఉందని, అలాంటి వారికి ఆ దేశంలో కార్యకలాపాలకు చోటు ఇచ్చారని ఆయన శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also: IAF: “ప్రచండ్” హెలికాప్టర్ల కొనుగోలు.. చైనా, పాక్ సరిహద్దుల్లో మోహరింపు..

ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా నగరమైన సర్రేలో హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. గురద్వారా నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన్ను హతమార్చారు. ఈ హత్య వెనక భారత ఏజెంట్లు ఉన్నారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో వ్యాఖ్యానించడంతో ఇరు దేశాల మధ్య చిచ్చురగిలింది. ఇదే కాకుండా కెనడా విదేశాంగ మంత్రి భారతీయ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా గట్టిగానే చర్యలు తీసుకుంది. కెనడా రాయబారికి సమన్లు జారీ చేసి, కెనడియన్ సీనియర్ దౌత్యవేత్తను 5 రోజుల్లో భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా చేసిన ఆరోపణల్ని భారత్ అసంబద్దమైన, రాజకీయ ప్రరేపిత వ్యాఖ్యలుగా అభివర్ణించింది.