Ram Navami violence: రామ నవమి పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. రామనవమి ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో పాటు పలు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు. హౌరా, హుగ్లీ, దల్‌ఖోలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. తాజాగా ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేత దర్యాప్తు చేయించాలని గురువారం ఆదేశించింది.
విచారణకు సంబంధించి అవసరమైన అన్ని పేపర్లను రెండు వారాల్లో ఎన్ఐఏకి అందించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి డివిజన్ బెంచ్ పశ్చిమబెంగాల్ పోలీసులను ఆదేశించింది. రెండు వారాల్లోగా అన్ని రికార్డులు, ఎఫ్‌ఐఆర్‌లు, సీసీటీవీ ఫుటేజీలను ఎన్‌ఐఏకి అందజేయాలని సంబంధిత పోలీసు స్టేషన్‌లను హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసీ రాగానే ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించనుంది. ఈ హింసాకాండపై ఎన్ఐఏ విచారణకు ఆదేశించాలని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా హైకోర్టు ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది.
Read Also: PM Modi: కాంగ్రెస్ అంటేనే అవినీతి, బంధుప్రీతికి గ్యారెంటీ..
గత నెలలో రామనవమి వేడుకల సందర్భంగా హౌరాలోని షిబ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో పలు వాహనాలకు నిప్పు పెట్టారు, రాళ్లు రువ్వారు మరియు దుకాణాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత హుగ్లీ జిల్లాలోని రిష్రా, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని దల్‌ఖోలాలో కూడా ఘర్షణలు జరిగాయి. ఈ హింసాకాండ అధికార త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణం అయింది. టీఎంసీ పార్టీ, సీఎం మమతా బెనర్జీ కావాలనే హిందువులను లక్ష్యంగా చేసుకుంటూ, ముస్లింలకు అండగా నిలుస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో విచారణ జరిగితే పట్టుబడతామని ఉద్దేశంతోనే బీజేపీ కేంద్ర సంస్థలతో విచారణ కోరుతోందని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.
బీజేపీ కావాలనే మత ఉద్రిక్తతలను పెంచుతోందని, ముస్లిం ఉన్న ఏరియాల్లోకి కావాలనే ఊరేగింపును తీసుకెళ్లాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ రాష్ట్రంలో హిందువులకు ముప్పు పొంచి ఉందని బీజేపీ ఎమ్మెల్యే లాకెట్ ఛటర్జీ ఆరోపించారు.