అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలో.. ఎన్నికల తర్వాత కూడా పశ్చిమ బెంగాల్‌లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.. దీనిపై రాజకీయ విమర్శలు దుమారమే రేపాయి.. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా హింసపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు.. మరోవైపు.. బీజేపీయే ఈ హింసకు కారణమంటూ కామెంట్లు చేస్తూ వచ్చారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. అయితే.. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో బాధితుల పునరావాసానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది కోల్‌కతా హైకోర్టు… రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, మెంబర్ సెక్రటరీ అండ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఒక్కొక్కరు ఈ కమిటీలో ఉండనున్నారు.. బాధితులు తమకు హక్కులు కలిగిన ప్రాంతాల్లో ఉండేందుకు వీలు కల్పించేందుకు పోలీసుల సమన్యయంతో కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తుందని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసపై విచారణ చేపట్టాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం.. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చెలరేగిన హింసతో పలువురు బాధితులు తమ నివాసాలను వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారని.. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ విషయంలో.. బీజేపీ వర్సెస్ టీఎంసీగా మారిపోయి పరిస్థితి… బెంగాల్ హింసపై ఆ రాష్ట్ర గవర్నర్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే.