India’s Population: భారతదేశ జనాభా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే మన దేశ జనాభా చైనాను అధిగమించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే 2060 దశకం ప్రారంభం నాటికి ఇండియా జనభా గరిష్టంగా 1.7 బిలియన్లకు(170 కోట్లు)కు చేరుతుందని, ఆ తర్వాత 12 శాతం తగ్గుతుందని, ఈ శతాబ్ధంలో భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి చెప్పింది. గురువారం ఇక్కడ విడుదల చేసిన ప్రపంచ జనాభా ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక ప్రకారం, రాబోయే 50-60 సంవత్సరాలలో ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంటుందని, 2024లో 8.2 బిలియన్ల నుండి 2080ల మధ్యకాలంలో సుమారు 10.3 బిలియన్ల జనాభాకు చేరుకోవచ్చని అంచనా వేసింది. శతాబ్ధం చివరి నాటికి 10.2 బిలియన్లకు పడిపోతుందని అంచనా వేసింది.
Read Also: Viral Video: 10 ఉద్యోగాలు.. 1,800 మంది అభ్యర్థులు హాజరు! కుప్పకూలిన రెయిలింగ్
గతేడాది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాను భారత్ అధిగమించింది. 2100 నాటి వరకు ఆ స్థానాన్ని కొనసాగిస్తుందని చెప్పింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల శాఖ ప్రచురించిన నివేదిక ప్రకారం.. 2024లో భారత జనాభా 1.45 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది 2054 నాటికి గరిష్టంగా 1.69 బిలియన్లకు చేరుకుంటుంది. 2100లో శతాబ్ధం చివరి నాటికి 1.5 బిలియన్లకు తగ్గతుందని అంచనా వేయబడింది. అయితే, అప్పటికీ భారత్ ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.
ప్రస్తుతం 2024లో చైనా జనాభా 1.41 బిలియన్లుగా ఉంది. 2054 నాటికి ఇది 1.21 బిలియన్లకు తగ్గుతుందని, 2100 నాటికి 633 మిలియన్లకు తగ్గుతుందని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన చైనా 2024-2054 మధ్య జనాభా నష్టాన్ని ఎదుర్కొంటుందని చెప్పింది. జనాభా నష్టంలో జపాన్, రష్యాలు చైనా తర్వాతి స్థానాల్లో ఉంటాయని నివేదిక హైలెట్ చేసింది. తక్కువ స్థాయి సంతానోత్పత్తి కారణంగా చైనా ఈ శతాబ్ధం చివరినాటికి (786 మిలియన్ల మంది) ఏ దేశంలోనైనా అతిపెద్ద జనాభా క్షీణతను నమోదు చేస్తుంది. 2100 నాటికి చైనా మరింత నష్టపోయే అవకాశం ఉంది.