NTV Telugu Site icon

Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన.. నిందితుల కాలిపోయిన ఫోన్లు, దుస్తులు స్వాధీనం..

Parliament Attack

Parliament Attack

Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. అది కూడా 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి జరిగిన డిసెంబర్ 13 తేదీనే నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసులతో పార్లమెంట్ లోకి ప్రవేశించి, సభ జరిగే సమయంలో ఛాంబర్ లోకి దూసుకెళ్లి పొగ క్యానిస్టర్లను పేల్చారు. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల ఇలాంటి చర్యకే పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని సూత్రధారి లలిత్ ఝా గురువారం పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ ఘటనలో సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలందేవీ, మహేష్‌ కుమావత్‌లను 7 రోజుల పోలీస్ కస్టడీకి పంపారు. ఢిల్లీ స్పెషల్ సెల్ ఈ కేసును విచారిస్తోంది.

Read Also: Bagheera: ప్రశాంత్ నీల్ రాసాడంటే… ఆ మాత్రం భోగ్గు ఉండాలి

నలుగురు పార్లమెంట్ వద్ద హంగామా చేయగా.. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా వారి మొబైల్ ఫోన్లు, దుస్తులను తీసుకుని రాజస్థాన్ పారిపోయాడు. అక్కడ ఇతనికి మహేష్ కుమావత్ బస ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఆధారాలను నాశనం చేసేందుకు నిందితుల మొబైల్ ఫోన్లు, దస్తులకు ఝా నిప్పటించాడు. ప్రస్తుతం వీటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారేందుకు నిందితులు ఈ డ్రామాకు పాల్పడ్డారు. పార్లమెంట్‌లో ఆత్మాహుతి చేసుకోవాలనే ఆలోచన కూడా నిందితులకు ఉన్నట్లు విచారణలో తేలింది.

ఈ ఘటన అధికార బీజేపీ, ప్రతిపక్షాలకు మధ్య మాటల యుద్ధాన్ని పెంచుతోంది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా జారీ చేసిన పాసుల్ని తీసుకుని ఇద్దరు నిందితులు పార్లమెంట్ లోకి చొరబడ్డారు. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఎంపీ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్ అత్యున్నత దర్యాప్తును కోరారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలోని నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, మోడీ విధానాలు పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు కారణమని ఆరోపించారు. అయితే కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు ఈ వ్యవహారాన్ని రాజకీయంగా మార్చొద్దంటూ ప్రతిపక్షాలపై విమర్శలకు దిగింది.