Senior Citizen Railway Concession: 2026 ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానుంది. ఈ బడ్జెట్ లో సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్ ఛార్జీలలో భారీ రిలీఫ్ లభించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. శతాబ్ది, రాజధాని, మెయిల్/ఎక్స్‌ప్రెస్ లాంటి ప్రధాన రైళ్లలో సీనియర్ సిటిజన్లకు 40 శాతం నుంచి 50 శాతం వరకు రాయితీలను పునరుద్ధరించాలని కేంద్రం పరిశీలిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 మార్చిలో నిలిపివేసిన రైల్వే సీనియర్ సిటిజన్ కన్సెషన్ను తిరిగి ప్రారంభించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా, బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ అండ్ రైల్వే మంత్రిత్వ శాఖ మధ్య ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, 60 ఏళ్లు నిండిన పురుషులు, 58 ఏళ్లు నిండిన మహిళలు మళ్లీ రాయితీలతో రైలు టికెట్లు పొందే అవకాశం ఉంది.
Read Also: Putin-Zelensky: 4 ఏళ్ల యుద్ధం తర్వాత కీలక పరిణామం.. జెలెన్‌స్కీని మాస్కోకు ఆహ్వానించిన రష్యా
సీనియర్ సిటిజన్ కన్సెషన్:
భారతీయ రైల్వేలు దశాబ్దాలుగా సీనియర్ సిటిజన్లకు టికెట్ రాయితీ సౌకర్యం అందిస్తూ వచ్చాయి. ఇందులో పురుషులకు 40 శాతం, మహిళలకు 50 శాతం వరకు టికెట్ ధరలపై తగ్గింపు ఉండేది. ఈ సౌకర్యం స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ సహా దాదాపు అన్ని తరగతులకు వర్తించేది. టికెట్ బుకింగ్ సమయంలో వయసు వివరాలు నమోదు చేస్తే సరిపోయేది. ప్రత్యేక కార్డు లేదా అదనపు ప్రక్రియ అవసరం ఉండేది కాదు. ఈ రాయితీ IRCTC ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ తో పాటు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో కూడా అందుబాటులో ఉండేది. అయితే, 2020 మార్చిలో కోవిడ్-19 విజృంభణ కారణంగా రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో రైల్వే తీవ్రమైన ఆర్థిక నష్టాలు ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్ కన్సెషన్‌ను పూర్తిగా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. కేవలం సీనియర్ సిటిజన్ రాయితీల వల్లే ఏటా సుమారు రూ.1,600 నుంచి రూ.2,000 కోట్ల వరకు నష్టం వస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తరువాత రైలు సేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించిన, టికెట్ ధరలు పెరిగినా, ఈ కన్సెషన్ మాత్రం ఇప్పటి వరకు తిరిగి అమలు చేయలేదు.
Read Also: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 512GB స్టోరేజ్, 520Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో Red Magic 11 Air లాంచ్
బడ్జెట్ 2026లో ఏమి ఆశించవచ్చు?
అయితే, 2026 బడ్జెట్‌కు ముందు జరిగిన సమావేశాల్లో సీనియర్ సిటిజన్ కన్సెషన్ పునరుద్ధరణ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం లభిస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
సీనియర్ సిటిజన్లకు ఇది ఎందుకు ముఖ్యం?
ఈ కన్సెషన్ కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, వృద్ధులకు రైలు ప్రయాణాన్ని మరింత సులభంగా, అందుబాటులోకి తీసుకొచ్చే ముఖ్యమైన సాయంగా నిలిచింది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వృద్ధులకు, వైద్య, కుటుంబ అవసరాల కోసం తరచూ ప్రయాణించే వారికి టికెట్ ఖర్చు తగ్గడం వల్ల పెద్ద ఊరట లభిస్తుంది. అందుకే ఈ రాయితీ పునరుద్ధరణపై సీనియర్ సిటిజన్లు దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
