యూపీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. చాలా రోజులుగా మౌనంగా,అజ్ఞాతంలో ఉండిపోయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు. యూపీ కాంగ్రెస్ చీఫ్, సీఎం అభ్యర్థినిగా ప్రచారం చేసుకుంటున్న ప్రియాంక గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగారు. కాంగ్రెస్ కేవలం బీజేపీయేతర ఓట్లను చీల్చడానికే తప్ప, ఆ పార్టీతో వచ్చే ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు మాయావతి. ఆ పార్టీ సీఎం అభ్యర్థి గంటల వ్యవధిలోనే తన విధానాన్ని మార్చుకుంటారని, స్థిరత్వం వారిలో లేదని ప్రియాంకను ఉద్దేశించి మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే ఓటును దుర్వినియోగం చేసుకోవడమే అన్నారు మాయవతి.
కాంగ్రెస్ పార్టీ తరఫున తానే సీఎం అభ్యర్థినంటూ శనివారం ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది సమయానికే పొరపాటుగా అన్నానని, అసలు ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో? లేదోనని ఆమె చెప్పడం తాజా విమర్శలకు కారణంగా చెప్పుకోవాలి. ఈ విడత ఎన్నికల్లో మాయావతి పోటీకి దూరంగా ఉండడం తెలిసిందే. అయినా సరే పార్టీ విజయం కోసం ఆమె ఆలస్యంగా అయినా తన ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరి యూపీ ప్రజలు మాయావతిని ఎలా ఆదరిస్తారో చూడాలి.
