యూపీ అసెంబ్లీ ఎన్నికలకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తమ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది. శనివారం బీఎస్పీ అధినేత్రి మాయావతి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె 53 మందితో కూడిన తొలి జాబితాలో విడుదల చేశారు. మరో ఐదుగురు అభ్యర్థుల్ని ఈరోజు సాయంత్రాని కల్లా ప్రకటిస్తామని ఆమె చెప్పారు. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో అన్ని స్తానాల్లో బీఎస్పీ పోటీ చేస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ.. ఎన్నికల ఫలితాల అనంతరమే పొత్తును ఉపసంహరించుకున్న విషయం తెల్సిందే.
Read Also: కోవిడ్ నిబంధనలను సడలించిన పశ్చిమ బెంగాల్
మరోవైపు ఇప్పటికే యూపీలో ఎస్పీ,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ 125 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) కూటమి వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం 29 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పశ్చిమ యూపీలోని స్థానాల అభ్యర్థుల లిస్ట్ వెల్లడించింది. ఈ స్థానాలకు ఫిబ్రవరి 10 మరియు 14 తేదీల్లో మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 29 స్థానాల్లో ఆర్‌ఎల్‌డీ 19 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఎస్పీ 10 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.మొత్తం ఏడు విడతల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10 న విడుదల కానున్నాయి.