Supreme Court: సంబంధాలు విచ్ఛన్నం కావడం మానసిక వేదనకు గురిచేస్తున్నప్పటికీ, నేరపూరిత నేరానికి దారితీసే ఉద్దేశం, ఆత్మహత్యలకు ప్రేరేపించదని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. ఐపీసీ కింద మోసం, ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరాలకు కర్ణాటక హైకోర్ట్ కమరుద్దీన్ దస్తగిర్ సనాదికి విధించిన శిక్షను కోర్టు కొట్టివేసింది. జస్టిస్ పంకజ్ మిథాల్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. ‘‘ఈ కేసు రిలేషన్ షిప్ బ్రేక్ గురించి, నేరప్రవర్తనకు సంబంధించింది కాదు’’ అని తీర్పులో పేర్కొంది.
సనాదిపై తొలుత IPC సెక్షన్లు 417 (మోసం), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 376 (అత్యాచారం) కింద అభియోగాలు మోపారు. ట్రయల్ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించగా, కర్ణాటక హైకోర్టు మోసం, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారించింది. అతడికి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ. 25,000 జరిమానా విధించింది. కేసు వివరాలను పరిశీలిస్తే, 21 ఏళ్ల తన కుమార్తె 8 ఏళ్ల పాటు నిందితుడితో ప్రేమలో ఉందని, వివాహం చేసుకుంటానని నమ్మించి మాటనిలబెట్టుకోలేదని, దీంతో ఆగస్టు 2007న తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి ఫిర్యాదు చేసింది.
Read Also: Bangladesh: మరీ ఇంత దారుణమా? ఆలయాలపై దాడులు.. హిందువులను ఊచకోత కోస్తున్నారు!(వీడియోలు)
జస్టిస్ మిథాల్ 17 పేజీల తీర్పును రాశారు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఆరోపణ లేదా ఆత్మహత్యకు దారి తీసే ఉద్దేశపూర్వక చర్యలు ఏమీ కనిపించలేదని పేర్కొన్నారు. అందువల్ల సంబంధాలు చెడిపోవడం మానసిక బాధని కలిగించేవిగా ఉంటాయి, కానీ ఆత్మహత్యలకు ప్రేరేపించడంగా పరిగణించలేము అని కోర్టు చెప్పింది.
‘‘బాధితురాలు ఆమె పట్ల జరిగిన క్రూరత్వం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. సమాజంతో అసమ్మతి, వైరుధ్యాలు చాలా సాధారణమని, దీని వల్ల ఇలాంటి నేరం ఎక్కువ జరుగుతున్నాయని కోర్టు అభిప్రాయపడింది. బాధితురాలి మానసిక స్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఖచ్చితంగా నిందితుడి నేరపూరిత ఉద్దేశ్యం నిర్ధారింబడే వరకు సెక్షన్ 306 ఐపీసీ ప్రకారం అతడిని దోషిగా నిర్ధారించడం సాధ్యం కాదని, నిందితుడు మహిళని ఆత్మహత్యు ప్రేరేపించాడనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని తీర్పులో చెప్పింది. సుదీర్ఘ సంబంధం తర్వాత కూడా వివాహానికి నిరాకరిస్తే అది ఆత్మహత్యకు ప్రేరేపణ కాదని చెప్పింది.