Brij Bhushan: బీజేపీ కీలక నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి షాక్ తగిలింది. అతనికి పార్టీ టికెట్ నిరాకరించింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఇతడిపై ఉన్నాయి. ఇతనికి వ్యతిరేకంగా గతేడాది మహిళా రెజ్లర్లతో పాటు పలువురు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కైసర్‌గంజ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బ్రిజ్ భూషన్‌ని తొలగించి, అతని కుమారుడు కరణ్‌ని ఈ స్థానం నుంచి ఎంపీ బరిలోకి దింపింది.
Read Also: Congress: పాకిస్తాన్ మాజీ మంత్రి ప్రశంసల వెనక ప్రధాని మోడీ హస్తం.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు..
ఉత్తర్ ప్రదేశ్‌లోని కైసర్ గంజ్ నుంచి వరసగా మూడు సార్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విజయం సాధించారు. అయితే, ఇప్పుడు లైంగిక ఆరోపణల కారణంగా ఇతడిని తప్పించి ఇతని చిన్న కొడుకు కరణ్‌ని ఆ స్థానం నుంచి బీజేపీ పోటీలో దింపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కైసర్‌గంజ్ నుంచి బ్రిజ్ భూషణ్ రెండు లక్షల ఓట్లతో గెలుపొందారు.
కరణ్ భూషణ్ సింగ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గోండాలోని నవాబ్‌గంజ్‌లోని సహకార గ్రామాభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కైసర్‌గంజ్ సీటుపై బ్రిజ్ భూషణ్‌తో బీజేపీ నాయకత్వం ఫోన్‌లో సంభాషించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రిజ్ భూషన్ పెద్ద కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నారు. లోక్‌సభ ఐదో దశలో మే 20న కైసర్ గంజ్ ఎంపీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.