NTV Telugu Site icon

Bangladesh: భారత్‌తో సంబంధాలు తెంచుకుంటూ.. పాకిస్తాన్‌తో పెంచుకుంటున్న బంగ్లాదేశ్..

Pak Bangla

Pak Bangla

Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మనెమ్మదిగా పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. ఇండియాతో సంబంధాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడైతే షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిందో అప్పటి నుంచి బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇస్లామిక్ మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే, నెమ్మదిగా యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌తో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్‌‌జీఏ) మీటింగ్‌ సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు.

Read Also: Israel-Iran War: ఇరాన్ చమురు, గ్యాస్ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చంటూ వార్తా కథనాలు

ఇటీవల బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం తన విదేశాంగ విధానాన్ని మార్చుకునేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, బెల్జియం, పోర్చుగల్ రాయబారుల్ని వెనక్కి పిలిపించింది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ పాకిస్తాన్‌తో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు, దిగుమతి చేసుకున్న వస్తువుల్ని తప్పనిసరిగా ఫిజికల్ చెకింగ్స్‌ చేయాలనే నిబంధనని తొలగించింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి పత్తి, నూలు, రసాయనాలు, గోధుమలు, ప్లాస్టిక్ పదార్థాలు, తోలుతో సహా అనేక రకాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. బియ్యం, పండ్లు, సర్జికల్ పరికరాలు, విద్యుత్ ఫ్యాన్ల కూడా దిగుమతి చేసుకునే వస్తువుల జాబితాలో ఉన్నాయి.

ఆగస్టులో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అక్కడి విద్యార్థులు చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియాకి పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇండియాలోనే ఆశ్రయం పొందుతున్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత భారత్ నమ్మకమైన మిత్రురాలిని కోల్పోయినట్లైంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు పెరిగాయి. మరోవైపు పాకిస్తాన్‌ని, జిన్నాని పొగుడుతూ పలువురు నాయకులు సభలు ఏర్పాటు చేస్తున్నారు. బంగ్లాదేశ్ భారత్‌తో ఏకంగా 4000 కి.మీ పైగా భూభాగాన్ని పంచుకుంటోంది. పాకిస్తాన్‌తో దాని స్నేహం భారత్‌కి కొత్త తలనొప్పుల్ని తెచ్చే అవకాశం కనిపిస్తోంది.

Show comments