Brain-Eating Amoeba: కేరళను ‘‘మెదడును తినే అమీబా’’ కలవరపెడుతోంది. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటస్(PAM) పిలువబడే ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 19 మంది మరణించారు.ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల వస్తుంది. ఇది సోకిన వ్యక్తిలో మెదడును ఈ అమీబా టార్గెట్ చేస్తుంది. ఈ ఏడాది కేరళలో 61 కేసుల్లో, 19 మంది మరణించారు. వీరిలో చాలా వరకు మరణాలు కొన్ని వారాల్లోనే నమోదయ్యాయి. కేరళ తీవ్రమైన ప్రజారోగ్య సమస్యతో పోరాడుతోందని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ అన్నారంటే, ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అసలేంటి ఈ ఇన్ఫెక్షన్.?
PAM కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ మెడదు కణజాలాన్ని నాశనం చేస్తుంది. చాలా సందర్భాల్లో తీవ్రమైన మెదడు వాపు, మరణానికి కారణమవుతుంది. ఇది వెచ్చని, నిలిచి ఉన్న నీటి నుంచి ఈ క్రిమి మానవశరీరంలోకి చేరుతుంది. ఇది ముక్కు ద్వారా మెదడును చేరి, ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఈ అమీబాలు ఉన్న చెరువుల్లో , నీటి కుంటల్లో ఈతకొట్టడం, డైవింగ్ చేయడం, స్నానం చేయడం ద్వారా సంక్రమించే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులు నీటి ఉష్ణోగ్రతల్ని పెరగడం, ఈ వ్యాధితో ముడిపడి ఉంది.
లక్షణాలు:
PAM లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రధానంగా దీనిని నిర్ధారించడం కష్టం. దీని లక్షణాలు బ్యాక్టీరియల్ మెనింజైటిస్ వలే ఉంటాయి. తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి మెనింజైటిస్ లక్షణాలు ఉండటంతో డాక్టర్లు ఇదే వ్యాధి అనుకుని PAM నిర్ధారణ ఆలస్యం చేస్తుంటారు. దీంతో రోగిని మరణానికి కారణమయ్యే సెరిబ్రల్ ఎడెమా నుంచి రక్షించడం కష్టం అవుతుంది. లక్షణాలు క్రిమి సోకిన ఒకటి నుంచి 9 రోజుల మధ్య కనిపించవచ్చు. వాటి తీవ్రత ప్రారంభమైన గంటల నుంచి 1-2 రోజుల్లో మరణం సంభవించే అవకాశం ఉంటుంది.
చికిత్స ఏంటి..?
గత ఆరు దశాబ్ధాలలో ఈ వ్యాధి నుంచి బయటపడిన వారు ప్రి-సెరిబ్రల్ దశలో నిర్ధారణ జరిగిన వారే. రోగ నిర్ధారణ ఈ వ్యాధిలో అత్యంత కీలకం. ప్రారంభ దశలో నిర్ధారణ, యాంటీమైక్రోబయల్ కాక్టెయిల్ ను సకాలంలో రోగికి అందించడం ప్రారంభిస్తే, ప్రాణాలు కాపాడవచ్చు.
కేరళలో 2016లో తొలిసారిగా ‘‘మెదడును తినే అమీబా’’ వ్యాధిని గుర్తించారు. ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం, అది నిలువ ఉన్న కొలను, చెరువుల్లో స్నానాలకు, ఈతకు దూరంగా ఉండటం. నీటిలోకి ప్రవేశించే ముందు ప్రజలు ముక్కు క్లిప్ ధరించాలని సూచించారు. బావులు, చెరువుల్ని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ ద్వారా శుభ్రం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
