Border issue between Karnataka and Maharashtra: కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతోంది. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా.. బీజేపీ వర్సెస్ బీజేపీగా మారింది ఈ వివాదం. ఇప్పటికే కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, కర్ణాటక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య మాటల తూటాలు పేలాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్యలకు బెలగావి కేంద్రంగా మారింది. అయితే మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా అక్కల్ కోట్ తహసీల్ పరిధిలోని 11 గ్రామాలు తమకు సరైన ప్రాథమిక సౌకర్యాలు లేవని.. తమను కర్ణాటక ప్రాంతంలో కలపాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం బొమ్మై ప్రస్తావించడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది.
Read Also: MCD Polls Results: బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెర.. ఢిల్లీ మున్సి’పోల్స్’లో ఆప్‌దే హవా
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రాంతాలకు తమ బస్సులను నిలిపివేసింది. మహారాష్ట్ర ఆర్టీసీ బుధవారం కర్ణాటక ప్రాంతాలకు సేవలను రద్దు చేసింది. దాడులు జరిగేందుకు అవకాశం ఉందనే ఇంటెలిజెన్స్ నివేదిక వల్ల కర్ణాటక ప్రాంతాలకు బస్సులను నిలిపివేశారు. ప్రయాణికుల భద్రతపై పోలీసుల నుంచి హామీ వచ్చిన తర్వాతే బస్సులను పునరుద్ధరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే పూణేలోని కర్ణాటక నెంబర్ ప్లేట్ ఉన్న ప్రైవేట్ బస్సుపై శివసేన (ఉద్ధవ్) వర్గం దాడికి పాల్పడింది. ఇక కర్ణాటక బెలగావిలో మహారాష్ట్ర లారీపై ఆందోళనకారులు దాడులు చేశారు.
1956లో రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి ఈ సమస్య అలాగే ఉంది. కర్ణాటకలోని బెళగావిని మహారాష్ట్ర తమదే అని చెబుతుంటే.. మహారాష్ట్రలోని షోలాపూర్ తమదే అని కర్ణాటక చెబుతోంది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న బెలగావి కర్ణాటకలో చేరింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంపై వివాదం చెలరేగుతూనే ఉంది. మరోవైపు కర్ణాటక మహారాష్ట్రలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో చేర్చాలని కర్ణాటక డిమాండ్ చేస్తోంది.