NTV Telugu Site icon

Hathras Stampede: హత్రాస్ ఘటన.. మృతదేహాలు బాధిత కుటుంబాలకు అప్పగింత

Hathras

Hathras

Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాటలో బాధితులందరి మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ గురువారం వెల్లడించారు. మంగళవారం హత్రాస్‌లో బోధకుడు నారాయణ్ సకార్ హరి లేదా భోలే బాబా నిర్వహించిన సత్సంగం తర్వాత జరిగిన తొక్కిసలాటలో మొత్తం 123 మంది మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు మృతి చెందారు. దాదాపు 31 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత 21 మృతదేహాలను ఆగ్రాకు, 28 ఎటాహ్‌కు, 34 హత్రాస్‌, 38 మృతదేహాలను అలీఘర్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అన్ని మృతదేహాలను గుర్తించి సంబంధిత కుటుంబాలకు అప్పగించినట్లు ఆశిష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం వరకు గుర్తుతెలియని మూడు మృతదేహాల్లో రెండు అర్థరాత్రి, ఒకటి గురువారం ఉదయం వీడియో కాల్‌ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడి గుర్తించినట్లు తెలిపారు. చివరి మృతదేహాన్ని కుటుంబసభ్యులు వీడియా కాల్‌ ద్వారా గుర్తించగా.. వారిని అలీఘర్‌ ఆస్పత్రికి వెళ్లాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు.

Read Also: Hathras Stampede: హత్రాస్‌ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందితుడి సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు

హత్రాస్ దుర్ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తొక్కిసలాట వెనుక “కుట్ర” దాగి ఉందనే విషయాన్ని కూడా పరిశీలిస్తోంది. ప్యానెల్ తన నివేదికను రెండు నెలల్లో సమర్పించనుంది. హత్రాస్‌లోని ఫుల్హరి గ్రామ సమీపంలో ‘సత్సంగ్’ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ సత్సంగ్ కార్యక్రమానికి 80,000 మందికి పరిపాలన అనుమతి ఇచ్చినప్పటికీ, 2.50 లక్షల మందికి పైగా ప్రజలు మతపరమైన సమావేశానికి హాజరయ్యారు. ‘ముఖ్య సేవాదార్’ దేవప్రకాష్ మధుకర్, ఇతర నిర్వాహకులపై మంగళవారం సికంద్రరావు పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్నారు. భోలే బాబా అని పిలువబడే బోధకుడి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. బుధవారం హత్రాస్‌ను సందర్శించి గాయపడిన వారిని పరామర్శించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా భోలేబాబాను ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ప్రాథమికంగా కేసు నమోదు చేశామని పోలీసులు ఆయనకు తెలిపినట్లు తెలిసింది.