డెలివరీ బాయ్‌లు అంటేనే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వస్తువులను ఇవ్వడం వారి బాధ్యత. కానీ తమిళనాడులో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కస్టమర్‌కు వస్తువులు అందించకుండా క్యాన్సిల్ చేయిపించాడు. ఇప్పుడు అతడు సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? డెలివరీ బాయ్ ఏం మంచి పని చేశాడు. తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
సమయం అర్ధరాత్రి. 3 ప్యాకెట్ల ఎలుకల మందు ఆర్డర్ వచ్చింది. బ్లింకిట్ డెలివరీ బాయ్ వస్తువులు ఇచ్చేందుకు ఇంటికెళ్లగా మహిళ ఏడుస్తూ కనిపించింది. వెంటనే డెలివరీ బాయ్‌కు మనసులో అనుమానం రేకెత్తించింది. అర్ధరాత్రి సమయంలో ఎలుకల మందు ఆర్డర్ చేయడంలోనే అనుమానం వచ్చింది. పైగా ఇంటికొచ్చి చూడగా మహిళ తీవ్ర మనోవేదన కనిపించింది. దీంతో మహిళ ఏదో చేసుకోబోతుందని భావించాడు. ఆత్మహత్య చేసుకోవడానికే ఎలుకల మందు ఆర్డర్ చేసిందని ఆలోచించాడు. పరిస్థితిని గమనించి ఆమెను ఒప్పించి ఆర్డర్ క్యాన్సిల్ చేయిపించాడు. ఇందుకు సంబంధించిన సంగతును డెలివరీ బాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
పోస్ట్‌లో ఇలా..
డెలివరీ బాయ్ ఇలా రాశాడు.. ‘‘ఎలుకల మందు డెలివరీ చేసేందుకు వెళ్తే ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె దగ్గరకు వెళ్లి నీకు ఏ సమస్య ఉన్నా ఆత్మహత్య చేసుకోకు అని చెప్పా. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని ఆర్డర్ చేశావా? అని అడిగాను. ఆమె.. లేదు బ్రో.. అలా కాదు అని బదులిచ్చింది. లేదు.. అబద్ధం చెప్పుకు.. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు. నీకు ఎలుకల సమస్య ఉంటే.. ఏడు గంటల సమయంలోనో.. అంతకంటే ముందుగానే ఆర్డర్ చేసి ఉండేదానివి.. లేదంటే మరుసటి రోజైన బుక్ చేసేదానివి. కానీ ఈ సమయంలో ఆర్డర్ చేయడానికి ఎటువంటి కారణం లేదు అని చెప్పా. మొత్తానికి ఆమెను ఒప్పించి ఆర్డర్ రద్దు చేయిపించా. ఈరోజు నేను ఏదో సాధించానని నాకు అనిపిస్తోంది.’’ అని రాసుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: Modi-Trump: ట్రంప్‌కు మోడీ ఫోన్ చేయలేదు.. వాణిజ్య ఒప్పందం నిలిచిపోవడంపై అమెరికా కొత్త వాదన
డెలివరీ బాయ్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఈ వీడియోను ఆరు మిలియన్ల మంది వీక్షించారు. మొదట మనిషిలా.. అటు తర్వాత డెలివరీ వర్కర్ లాగా వ్యవహరించావంటూ కొనియాడుతున్నారు. నీలాంటి వాళ్లు ఇంకా ఉన్నందునే ప్రపంచం జీవిస్తోందని ఇంకొకరు రాసుకొచ్చారు.