దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కేసులు మూడున్నర లక్షలు ఉంటే, కోలుకున్న రోగుల సంఖ్య కూడా మూడున్నర లక్షలకు పైగా ఉంటోంది. అయితే, ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారికి బ్లాక్ ఫంగస్ ఎటాక్ అవుతున్నది. మొదట ఈ కేసులు గుజరాట్, మహారాష్ట్ర, ఢిల్లి తదితర రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. కాగా, ఇప్పుడు ఈ కేసులు యూపీలో కూడా బయటపడుతున్నాయి. బ్లాక్ ఫంగస్ కారణంగా కొంతమంది కంటిచూపు కోల్పోతుండగా, మరికొంత మందికి దవడలను తొలగిస్తున్నారు. సహజసిద్దంగా గాలిలో మ్యూకోర్ అనే ఫంగస్ ఉంటుంది. దీనిని పీల్చినపుడు గాలిద్వారా ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. కరోనా నుంచి కోలుకునే సమయంలో తలెత్తే సమస్యల వలన ఆ బ్లాక్ ఫంగస్ కంటిలోపలికి ప్రవేశిస్తుంది. ఫలితంగా చూపు కోల్పోవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలోనే అధికంగా ఈ కేసులు కనిపిస్తున్నాయి.