NTV Telugu Site icon

BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓటుకు నోటు’’.. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు..

Bjp

Bjp

BJP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు పంపిణీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వినోద్ తావ్డే, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సుప్రియా శ్రీనాట్, రాహుల్ గాంధీలకు లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్‌లోని ఓ హోటల్‌లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేత రూ.5 కోట్లు పంపిణీ చేశారని బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) నాయకుడు హితేంద్ర ఠాకూర్ మంగళవారం ఆరోపించిన నేపథ్యంలో తావ్డే లీగల్ నోటీసు వచ్చింది.

తనపై వచ్చిన ఆరోపణలు తప్పుడువని, నిరాధారమైనవని, దుష్ర్పవర్తనతో చేసినవని తావ్డే నోటీసుల్లో పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో తనపై ఆరోపణలు చేసిన ముగ్గురు కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు, ఒక హోటల్‌లో చొరబడిన బీవీఏ కార్యకర్తలు అక్కడే ఉన్న తావ్డే రూ. 5 కోట్లతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడనే వీడియోని పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్‌గా మారింది. హోటల్ గదుల నుంచి రూ. 9.93 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి మంగళవారం తెలిపారు.

తావ్డే ఈ ఆరోపణల్ని ఖండించారు. తాను ఎన్నికల విధానాలపై పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకత్వం మాత్రమే అందిస్తున్నానని, ప్రత్యర్థి హోటల్‌లో డబ్బు పంపినీ చేసేంత తెలివితక్కువ వాడిని కాదని అన్నారు. వివంతా హోటల్ ఠాకూర్‌లకు చెందినదని, వారి హోట‌ల్‌కి వెళ్లి అక్కడ డబ్బు పంచేంత మూర్ఖుడిని కాదనని తావ్డే మీడియా సమావేశంలో అన్నారు. ఈ వివాదానికి సంబంధించి పోలీసులు మంగళవారం తావ్డే, బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్ తదితరులపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. తావ్డేపై ఎన్నికల సంఘం మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది.