BJP: తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి అధికారం చేపట్టబోతున్నారు. మొత్తం 543 స్థానాలు ఉన్న లోక్‌సభలో బీజేపీ కూటమి 293 సీట్లను సాధించింది. అధికారం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 272 మార్కుని దాటింది. అయితే, గతంలో 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మెజారిటీ మార్కును దాటింది. ఈ సారి మాత్రం బీజేపీ 240 సీట్లను గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ వంటి పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: Ajit Pawar: అజిత్ పవార్‌కి షాక్.. కీలక సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరు..
ముఖ్యంగా గత రెండు పర్యాయాలు బీజేపీ అధికారానికి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కీలకంగా వ్యవహరించింది. 80 ఎంపీ సీట్లు ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో గత రెండు సార్లు 60 కన్నా ఎక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీ 33 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) 37 సీట్లను, మిత్రపక్షం కాంగ్రెస్ 06 సీట్లతో గెలుచుకున్నాయి.
అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ ఎంపీ సీటులో కూడా బీజేపీ ఓడిపోయింది. ఈ ఓటమిని దేశప్రజలు ఎవరూ కూడా ఊహించి ఉండరు. అయితే ఈ ఓటమికి తనదే బాధ్యత అని ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ చౌదరి భూపేంద్ర సింగ్ గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజీనామా అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ మెజారిటీ మార్కు చేరుకోవడంలో విఫలమైనందుకు, పార్టీ పేలవ ప్రదర్శనకు ఆయన బాధ్యత వహించి రాజీనామా చేశాడని తెలుస్తోంది.