NTV Telugu Site icon

Bihar Politics: సీఎంగా నితీష్.. బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరు..

Bjp

Bjp

Bihar Politics: బీహార్ రాజకీయాలు కొలిక్కి వచ్చాయి. గత మూడు రోజులుగా వరసగా ఆ రాష్ట్ర పరిణామాలు దేశంలో చర్చనీయాంశంగా మారాయి. ఇండియా కూటమి నుంచి, ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాల మహాఘటబంధన్ నుంచి సీఎం నితీష్ కుమార్, ఆయన పార్టీ జేడీయూ వైదొలిగింది. తన పాతమిత్రులు బీజేపీ మద్దతుతో మరోసారి బీహార్ సీఎంగా ఈ రోజు సాయంత్రం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read Also: Bihar Politics: నితీష్ వైఖరిపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు

నితీష్ కుమార్ ఆదివారం బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు తన రాజీనామాను సమర్పించారు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీ నుంచి ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజయ్ సిన్హాలు నితీష్ డిప్యూటీలుగా ఉండనున్నారు. బిజెపి, జెడి(యు) మరియు ఇతర మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను బీహార్ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.

‘నా జీవితంలో బీజేపీ చారిత్రాత్మకమైన పనిచేసింది. శాసనసభా పక్ష నేతగా ఎన్నికై, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం నాకు ఎమోషనల్ మూమెంట్’ అని సామ్రాట్ చైదరి అన్నారు. బీహార్‌లో లాలూ భీభత్సాన్ని అంతమొందించడానికి మాకు లభించిన ఆదేశమని, బీహార్‌లో జంగిల్ రాజ్ ఉండకూడదని నితీష్ కుమార్ నుంచి హామీ రావడంతో జేడీయూకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.