NTV Telugu Site icon

BJP MP Nishikant Dubey: ఆ ప్రాంతాలను యూటీగా చేయడం లేకుంటే హిందువులు కనుమరుగైపోతారు..

Bjp Mp Nishikant Dubey

Bjp Mp Nishikant Dubey

BJP MP Nishikant Dubey: జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాల్లోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. జార్ఖండ్‌లో 10 శాతం గిరిజన జనాభా తగ్గిందని, వారంతా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. “మాల్దా, ముర్షిదాబాద్, అరారియా, కిషన్‌గంజ్, కతిహార్ మరియు సంతాల్ పరగణాస్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని, లేకుంటే హిందువులు కనుమరుగైపోతారు” అని, ఈ ప్రాంతాల్లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బంగ్లాదేశ్ ముస్లింలు ఈ ప్రాంతాల్లోకి చొరబడి, జిల్లా పరిషత్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గిరిజన మహిళల్ని పెళ్లి చేసుకుంటున్నారని దూబే పేర్కొన్నారు. మహిళ గిరిజనురాలైతే, ఆమె భర్త ముస్లిం అని, ఇలా రాష్ట్రంలో కనీసం 100 మంది గ్రామపెద్దలు ముస్లింలుగా ఉన్నారని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వలసదారులు జార్ఖండ్‌లోకి ప్రవేశించి హిందూ జనాభాను తరిమేస్తున్నారని, సంతాల్ పరగణా ప్రాంతంలో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిందని చెప్పారు.

Read Also: Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. మహిళపై మామ అఘాయిత్యం.. బాధితురాలు ఆత్మహత్య

సంతాల్ పరగణా నుంచే తాను వచ్చానని, బీహార్ నుంచి సంతాల్ పరగణా విడిపోయి జార్ఖండ్‌‌లో భాగమైన 2000లో ఇక్కడ 36 శాతం గిరిజనులు ఉండగా, ఇప్పడు వారి జనాభా 26 శాతానికి చేరింది, మిగతా 10 శాతం గిరిజనులు మాయమైపోయారా..? అంటూ ప్రశ్నించారు. తమ రాష్ట్రంలోని జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవడం లేదని, బంగ్లాదేశ్ నుంచి తమ రాష్ట్రంలోకి చొరబాట్లు పెరుగుతున్నాయని అన్నారు. తన వాదన తప్పని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

పాకుర్‌లోని తారానగర్-ఇలామి, దగాపరాలో అల్లర్లు చెలరేగాయి. ఎందుకంటే మాల్దా, ముర్షిదాబాద్ ప్రజలు మా ప్రజలను తరిమికొడుతున్నారని, హిందూ గ్రామాలు ఖాళీ అవుతున్నాయని, ఇది తీవ్రమైన విషయమని అన్నారు. తాను రికార్డులో ఉన్నవే చెబుతున్నానని చెప్పారు. జార్ఖండ్ పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని, కిషన్ గంజ్, అరారియా, కతిహార్, మాల్దా, ముర్షిదాబాద్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయాలని, లేకుంటే హిందువులు కనుమరుగు అవుతారని చెప్పారు.