NTV Telugu Site icon

BJP: సీజేఐ ఇంట్లో “గణపతి పూజ”కు పీఎం మోడీ.. విమర్శలకు “ఇఫ్తార్ విందు”తో బీజేపీ సమాధానం..

Bjp

Bjp

BJP: ప్రధాని నరేంద్రమోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంటికి వెళ్లడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. గణపతి పూజ సందర్భంగా మోడీ, చంద్రచూడ్ ఇంటికి వెళ్లారు. గణపతి పూజలో సీజేఐ దంపతులతో కలిసి ఉన్న ఫోటోని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఆర్జేడీ వంటి ఇండియా కూటమి నేతలు ప్రధాని వెళ్లడాన్ని తప్పుపడుతున్నాయి.

Read Also: Sangareddy: కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి బాలికపై అత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష

ఇదిలా ఉంటే, బీజేపీ కూడా అంతే ధీటుగా ఇండియా కూటమి నేతలకు బదులిస్తోంది. ‘‘గణపతి పూజ‌’’ విమర్శలకు ‘‘ఇఫ్తార్ విందు’’తో సమాధానం ఇచ్చింది. ప్రతిపక్షాలు ‘‘ద్వంద్వ ప్రమాణాలు’’గా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది. 2009లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన నివాసంలో ఇఫ్తార్ పార్టీకి అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ హాజరైన విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా గుర్తు చేశారు. ఆనాటి ఫోటోలను పంచుకున్నారు.

‘‘2009లో పీఎం మన్మోహన్ సింగ్ ఇఫ్తార్ పార్టీకి అప్పటి సీజేఐ కేజీ బాలకృష్ణన్ హాజరయ్యారు..ష్‌ష్- ఇది సెక్యులరిజం.. న్యాయవ్యవస్థ సురక్షితం. పీఏ మోడీ ప్రస్తుతం సీజేఐ ఇంట్లో గణపతి పూజకు హాజరయ్యారు. ఓ మై గాడ్ ఇది న్యాయవ్యవస్థ కాంప్రమైజ్ అయింది’’ అని పూనావాలా వ్యంగ్యంగా ట్వీట్ చేసి, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. 2009లో న్యూఢిల్లీలో ప్రధానిమంత్రి నివాసంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దీనికి మన్మోహన్ సింగ్‌తో పాటు ఆయన భార్య గురుశరణ్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు అప్పటి బీజేపీ చీఫ్ లాల్ కృష్ణ అద్వానీ, సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, రాష్ట్రీయ జనతాదళ్ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి రాజకీయ నేతలు పాల్గొన్నారు.