NTV Telugu Site icon

Delhi BJP: నేడు ఢిల్లీలో బిజెపి కీలక సమావేశం.. 2024 సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చ

Bjp Meeting

Bjp Meeting

Delhi BJP: 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడంతోపాటు.. ఈ ఏడాది చివర్లో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం భారతీ జనతా పార్టీ(బీజేపీ) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా బీజేపీ అధిష్టానం సమావేశాల మీద సమావేశాలను నిర్వహిస్తోంది. బీజేపీలో ఉన్న నాయకుల్లో ఐక్యతను నింపడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అర్థరాత్రి అత్యవసరంగా బీజేపీ ఎన్నికల వ్యూహా కమిటీ సమావేశాన్ని తన నివాసంలో నిర్వహించారు. సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో ఎన్నికల వ్యూహా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా సుమారు 5 గంటలపాటు సమావేశం జరిగింది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ మరో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇంచార్జ్ లు, వివిధ మోర్చాల అధ్యక్షులు, మోర్చాల ఇంచార్జ్ లతో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ సమావేశం కానున్నారు.

Read also: Telangana BJP: బీజేపీలో కీలక మార్పులు..! బండిని తప్పిస్తే పార్టీ చీఫ్ ఎవరు..?

డిసెంబర్‌లో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం పార్టీ బలోపేతం చేయడం.. పార్టీ సంస్థాగత అంశాలు వాటితోపాటు ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశాన్ని ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు ధఫాలుగా నిర్వహించనున్నారు. ఉదయం జరిగే సమావేశంలో మొదటగా జాతీయ ప్రధాన కార్యదర్శులతో తర్వాత మోర్చాల అధ్యక్షులతో పార్టీ పరిస్థితులపై అధిష్టానం చర్చించనుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ లో భాగంగా ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఒక నివేదిక రూపంలో అధిష్ఠానానికి నాయకులు సమర్పించనున్నారు. డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం లో పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల వ్యూహాలు, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, భవిష్యత్‌ పార్టీ కార్యచరణపై అధిష్టానం పెద్దలు సమావేశానికి హాజరైన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Show comments