NTV Telugu Site icon

Amit Shah: 2024లో బీజేపీదే అధికారం.. 300కు పైగా లోక్‌సభ స్థానాలు గెలుస్తాం..

Amit Shah

Amit Shah

Amit Shah: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 300కు పైగా లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అస్సాం దిబ్రూఘర్ లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్ సభ స్థానాలకు గానూ 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు.

2024 ఎన్నికల్లో 300 సీట్లకు పైగా గెలుపొందడం ద్వారా మూడోసారి నరేంద్రమోదీ ప్రధాని అవుతారని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు కాంగ్రెస్ కు కంచుకోటగా భావించబడేదని, అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న సందర్భంలో కూడా ఇటీవల జరిగిన మూడు ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని, కాంగ్రెస్ పనితీరు అర్థం అవుతోందని అన్నారు. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, మిగతా రెండు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది.

Read Also: Vladimir Putin: ఆందోళనకరంగా పుతిన్ ఆరోగ్యం.. అస్పష్టమైన చూపు, తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న అధ్యక్షుడు..

రాహుల్ గాంధీ యూకే పర్యటనలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. భారత దేశాన్ని, ఇతర దేశాలకు వెళ్లి అవమానిస్తున్నాడని, అబద్ధాలు చెబుతూ దేశం, ప్రభుత్వం పరువు తీస్తున్నాడని, ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పతనం అయినట్లే దేశవ్యాప్తంగా కూడా తుడిచిపెట్టుకుపోతుందని ఆయన అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీని ఎంత విమర్శిస్తే, అంతగా బీజేపీ అభివృద్ధి చెందుతుందని అన్నారు.

వివాదాస్పద సాయుధ దళాల(ప్రత్యేక అధికారాలు) చట్టం 1958 లేదా AFSPAని అస్సాంలోని 70 శాతం ప్రాంతం నుండి తొలగించామని, బోడోలాండ్, కర్బీ అంగ్లాంగ్ ప్రాంతాలు శాంతియుతంగా ఉన్నాయని, దాని పొరుగు ప్రావిన్సులతో రాష్ట్ర సరిహద్దు వివాదాలు పరిష్కరించబడుతున్నాయని అమిత్ షా చెప్పారు. గతంలో అస్సాం ఆందోళనలకు, ఉగ్రవాదానికి ప్రసిద్ధిగా ఉండేదని కానీ ఇప్పుడు శాంతి నెలకొందని ఆయన అన్నారు.