Aaditya Thackeray: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం, బీజేపీ ఘన విజయం సాధించడం ఇండియా కూటమిలో ప్రకంపనలకు కారణమైంది. దీనికి తోడు శివసేన ఏక్‌నాథ్ షిండేని, శరద్ పవార్ అవార్డుతో సత్కరించడం కూడా ప్రతిపక్ష కూటమిలో తీవ్ర విభేదాలకు కారణమైనట్లు తెలుస్తోంది. తమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని ఎలా సత్కరిస్తారని ఉద్ధవ్ ఠాక్రే శివసేన ప్రశ్నిస్తోంది.
Read Also: Minister Atchannaidu: టీడీపీ ఆఫీస్‌పై దాడిని అందరూ చూశారు.. వంశీ అరెస్ట్‌లో రహస్యం ఏమీలేదు..
ఇదిలా ఉంటే, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఇండియా కూటమి ప్రధాన నేతల్ని కలుస్తున్నారు. శరద్ పవార్, ఏక్‌నాథ్ షిండేని సత్కరించడంపై మాట్లాడుతూ.. ఇలాంటి వ్యక్తిని గౌరవించకూడదు, ఆయన పార్టీనే కాదు, మహారాష్ట్ర వెన్నెముకను కూడా విభజించారని అన్నారు. తాను బుధవారం రాత్రి రాహుల్ గాంధీని కలిశానని,ఈ రోజు సాయంత్రం ఆప్ అధినేత కేజ్రీవాల్‌ని కలుస్తానని చెప్పారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు.
ఎన్నికల మోసాలు, ఈవీఎంలు హ్యాకింగ్ గురించి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు సందేహంలో ఉందని, ఈవీఎంల మోసాల వల్ల మన ఓటు ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదని ఆయన అన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదని అన్నారు. తమకు, కేజ్రీవాల్‌కి, కాంగ్రెస్‌కి ఏం జరిగిందో భవిష్యత్తులో నితీష్ కుమార్‌కి, చంద్రబాబు నాయుడులకు కూడా జరగొచ్చు అని అన్నారు.