Waqf Board: కర్ణాటకలో వక్ఫ్ బోర్డు తీరు వివాదాస్పదంగా మారింది. విజయపుర జిల్లాలోని రైతుల భూమి తమదే అని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయడంతో బీజేపీ, అధికార కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హోన్వాడ గ్రామంలోని రైతులకు మాట్లాడుతూ.. తమ పూర్వీకులు భూమిలో 1500 ఎకరాలను వక్ఫ్ బోర్డుకు రీ అసైన్డ్ చేస్తున్నట్లు అక్టోబర్ 04న తహసీల్దార్ నుంచి లేఖ అందినట్లు తెలిపారు. హొన్వాడ గ్రామంలోని రైతుల భూములను వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా 15 రోజుల్లోగా నమోదు చేయాలని కర్ణాటక వక్ఫ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఆదేశించినట్లు బీజేపీ ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ.. రైతులకు చెందిన భూమిని తీసుకోబోమని తేల్చి చెప్పింది.
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య శుక్రవారం హోన్వాడ గ్రామంలోని రైతులను కలుసుకున్నారు. ఈ భూమి వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడానికి ముందు ఎలాంటి ఆధారాలు లేదా వివరాలు ఇవ్వకుండా రైతులకు నోటీసులు అందించారని అన్నారు. ఇటీవల నెలల్లో విజయపుర జిల్లాకు చెందిన రైతుల భూమిని వక్ఫ్ భూమిగా ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని తేజస్వీ అన్నారు. వక్ఫ్ బోర్డు సంస్కరణలపై ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రం వక్ఫ్ చట్టాన్ని తీసుకువస్తుందని భావించిన జమీర్ అహ్మద్ ఖాన్, 15 రోజుల్లో భూమిని వక్ఫ్ ప్రాపర్టీగా నమోదు చేయాలని డిప్యూటీ కమీషనర్, రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు ఆయన ఆరోపించారు.
Read Also: Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
వక్ఫ్ చట్టంలోని ప్రస్తుత నిబంధనల వల్ల మెజారిటీ పేద ముస్లింలు కూడా ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి అన్నారు. విజయపురలో ఏం జరిగినా ఒప్పుకోం, కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో ఇలాగే జరుగుతోందని, జమీర్ అహ్మద్ ఖాన్‌కి రైతుల గురించి పట్టింపు లేదు, ఓట్ల కోసం ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని బీజేపీ విజయపుర ఎమ్మెల్య బసనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. రైతుల తరుపున హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని చెప్పారు.
అయితే, వక్ఫ్ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ భూమి వక్ఫ్ ప్రాపర్టీ కాబట్టి నోటీసులు జారీ చేశామని చెప్పారు. “అది వక్ఫ్ ఆస్తి అయితే అప్పుడు మాత్రమే నోటీసు ఇస్తాం.. అనవసరంగా ఎందుకు నోటీసు ఇస్తాం.. అది రైతులైనా, ప్రభుత్వమైనా, ఎవరైనా సరే.. నోటీసులు ఇస్తాం.. అది వక్ఫ్ ఆస్తి కాబట్టి మేం క్లెయిమ్ చేసుకోవాలి.. వాళ్లను అనుమతించండి. (రైతులు) చట్టబద్ధంగా పోరాడండి” అని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మరో మంత్రి ఎంబి పాటిల్ గ్రామంలోని రైతులతో సమావేశమయ్యారు. సంబంధిత పత్రాలు ఉంటే భూమిని తీసుకోబోమని చెప్పారు.