NTV Telugu Site icon

Rahul Gandhi: ‘‘సిక్కు’’ వివాదాస్పద వ్యాఖ్యలపై మౌనం వీడిన రాహుల్ గాంధీ.. బీజేపీపై ఆరోపణలు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన వివాదాస్పదంగా మారింది. సిక్కులపై, రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. మరోవైపు సిక్కులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిక్కు సంఘాలు సోనియా గాంధీ నివాసం ముందు నిరసన తెలిపారు.

ఇదిలా ఉంటే, అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తొలిసారిగా రాహుల్ గాంధీ మౌనం వీడారు. బీజేపీ అబద్ధాలను చెబుతోందని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సిక్కు కమ్యూనిటీ గురించి తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా తప్పు ఉందా..? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘‘నేను భారతదేశంలో, విదేశాల్లో ఉన్న ప్రతీ సిక్కు సోదరుడుని, సోదరీమణులను అడగాలనుకుంటున్నాను. నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉందా..? భారతదేశంలో ప్రతీ సిక్కు లేదా ప్రతీ భారతీయుడు తన మతాన్ని నిర్భయంగా ఆచరించే దేశంగా ఉందా..? ’’ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

Read Also: Tirupati laddoos: తిరుపతి లడ్డూలకు “నందిని” నెయ్యి.. జీపీఎస్, ఎలక్ట్రిక్ లాక్స్‌తో రక్షణ..

అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ‘‘ఎప్పటి లాగే బీజేపీ అసత్య ప్రచారాన్ని ఆశ్రయించింది. వారు సత్యాన్ని సహించలేదక నన్ను మౌనంగా ఉంచాలని తహతహలాడుతున్నారు. కానీ భారతదేశాన్ని నిర్వచించే విలువలైన భిన్నత్వంలో ఏకత్వం కోసం ఎల్లప్పుడూ మాట్లాడుతాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.

సెప్టెంబర్ 10న, వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ భారతదేశంలో సిక్కులు తలపాగా ధరించడానికి, కారా ధరించి గురుద్వారాలకు వెళ్లేందుకు అనుమతించబడుతారా..? దీనిపై భారత్‌లో పోరాటం జరుగుతోంది. ఇది ఒక సిక్కులకు సంబంధించిందే కాదు, అన్ని మతాలకు సంబంధించింది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత అంటే ద్వేషించే అమెరికా చట్టసభ సభ్యురాలు ఇల్హన్ ఓమర్‌తో రాహుల్ గాంధీ భేటీ అవ్వడాన్ని కూడా బీజేపీ తీవ్రంగా విమర్శించింది.