NTV Telugu Site icon

కేంద్ర మంత్రి సంచ‌ల‌నం.. బీజేపీ-శివ‌సేన సంకీర్ణ స‌ర్కార్..!

Ramdas Athawale

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత చోటు చేసుకున్న అనూహ్య ప‌రిణామాల‌తో మ‌హారాష్ట్రలో అప్ప‌టివ‌ర‌కు స్నేహితులుగా ఉన్న బీజేపీ-శివ‌సేన విడిపోయాయి.. ఎవ‌రూ ఊహించ‌న‌వి విధంగా.. ఎన్సీపీతో శివ‌సేన జ‌త‌క‌ట్టింది.. దీంతో.. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్ర‌మాణస్వీకారం చేశారు.. అయితే, ఆ త‌ర్వాత మ‌ళ్లీ బీజేపీ-శివ‌సేన క‌లిసి మ‌హారాష్ట్రలో స‌ర్కార్‌ను ఏర్పాటు చేస్తాయ‌నే గుస‌గుస‌లు వినిపిస్తూనే ఉన్నాయి.. ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని శివ‌సేన‌, ఎన్సీపీ ఖండిస్తూనే ఉన్నాయి.. కానీ, తాజాగా.. సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌ల‌వ‌డం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఆయ‌న సీఎం హోదాలో క‌లిసారు.. అంత‌కుమించి ఏమీలేద‌ని స్టేట్‌మెంట్ ఇచ్చారు.. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు కేంద్ర మంత్రి.. రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్య‌క్షుడు రామ్‌దాస్ అథ‌వాలే చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి..

మ‌హారాష్ట్రలో బీజెపీ, శివసేనతో సహా ఇతర పార్టీలు సంయుక్తంగా మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు అథవాలే.. అంతేకాదు.. త‌మ కూట‌మిలో సీఎం ప‌ద‌విని శివసేన కొంత‌కాలం.. ఆ త‌ర్వాత బీజేపీ మ‌రికొంత కాలం చేప‌డ‌తాయ‌ని.. దీనిపై ఇప్ప‌టికే మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కూడా చర్చించామ‌ని పేర్కొన్నారు. దీనిపై త్వ‌ర‌లోనే ప్ర‌ధాని మోడీతో జ‌రిగే కీల‌క భేటీలో నిర్ణ‌యం వెల్ల‌డిస్తార‌ని చెప్పుకొచ్చారు. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన త‌ర్వాత‌.. రామ్‌దాస్ అథవాలే ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే, పీఎం, సీఎం భేటీపై ఎన్సీపీ ఇప్ప‌టికే కొంత అసంతృప్తి వ్య‌క్తం చేసింది.. మ‌రి మ‌హారాష్ట్ర రాజ‌కీయ‌లు ఏ మ‌లుపు తీసుకుంటాయేన‌నే ఆస‌క్తి నెల‌కొంది.