Site icon NTV Telugu

Parliament: ఇదిగో ప్రూప్.. ఇప్పుడేమంటారు.. ఈ-సిగరెట్‌పై మమతను ప్రశ్నించిన బీజేపీ

Parliamenttmc

Parliamenttmc

పార్లమెంట్‌లో ఈ-సిగరెట్ వివాదం ఇంకా కొనసాగుతోంది. గత వారం బీజేపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ లోపల ఈ-సిగరెట్ తాగేందుకు అనుమతి ఉందా? అంటూ స్పీకర్ ఓం బిర్లాను ప్రశ్నించారు. అందుకు సమాధానంగా స్పీకర్ లేదని చెప్పారు. అయితే పార్లమెంట్‌ లోపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ధూమపానం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే బీజేపీ ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ తీవ్రంగా ఖండించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఏ మాత్రం భావ్యం కాదని సూచించారు.

తాజాగా పార్లమెంట్‌ లోపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ ఈ-సిగరెట్ తాగుతున్న వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి వీడియోను పోస్ట్ చేశారు. పార్లమెంటు లోపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ వాపింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ‘‘ఇది నేరం! ఇది ప్రజాస్వామ్య ఆలయాన్ని అవమానించడం! మమతా బెనర్జీ స్పందించాలి. ఆమె ఎంపీలు భారత ప్రజల ముందు ఎలాంటి విధానాన్ని చూపిస్తున్నారు?.’’ అని రాసుకొచ్చారు.

కీర్తి ఆజాద్ స్పందిస్తూ… పార్లమెంట్ ఆవరణలో ధూమపానం చేసే వందలాది మంది పార్లమెంట్ సభ్యుల పేర్లను తాను చెప్పగలనన్నారు. కానీ తాను అంత స్థాయికి దిగజారకూడదనుకుంటున్నాని చెప్పారు. ఒక బీజేపీ ఎంపీ MPLADS పై 30 నుంచి 40 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తే దానికి సమాధానం లేదన్నారు. ఎవరైనా సభ నియమాలు, విధానాలు తెలుసుకోవాలని.. ఏదైనా ఆరోపణలు చేసే ముందు స్పీకర్‌కు తెలియజేయాలని కీర్తి ఆజాద్ చెప్పుకొచ్చారు.

 

Exit mobile version