NTV Telugu Site icon

Haryana Polls: వినేష్ ఫోగట్‌పై కెప్టెన్‌ను బరిలోకి దింపిన బీజేపీ.. ఎవరీ ఈ కెప్టెన్ అంటే..!

Vineshphogat

Vineshphogat

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాజకీయ వాతావరణం వేడుక్కుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ఇప్పటికే కొంత మంది అభ్యర్థులను వెల్లడించాయి. దీంతో ప్రత్యర్థులు ఎవరనేది తేలిపోతుంది. మంగళవారం బీజేపీ 21 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. దీంతో రాజకీయ ప్రత్యర్థులపై క్లారిటీ వస్తోంది.

ఇది కూడా చదవండి: Samsung: ‘‘మడత పెట్టినప్పుడు చెప్పండి’’..ఆపిల్ ఐఫోన్ 16పై సామ్‌సంగ్ సెటైర్లు..

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరి జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. హస్తం పార్టీలో చేరిన కొద్ది సేపటికే ఈ స్థానాన్ని కేటాయించింది. తాజాగా వినేష్ ఫోగట్‌పై కమలం పార్టీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. మంగళవారం ప్రకటించిన రెండో జాబితాలో జులానా బీజేపీ అభ్యర్థిగా బీజేపీ యూత్ లీడర్ కెప్టెన్ యోగేశ్ బైరాగిని బరిలోకి దింపింది. దీంతో వినేష్ ఫోగట్‌ వర్సెస్ కెప్టెన్ యోగేశ్‌గా మారింది. జులానాలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని వినేష్ ఫోగట్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యానించారు.

కెప్టెన్ ఎవరు?
కెప్టెన్ యోగేష్ బైరాగి భారతీయ జనతా యువమోర్చా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అలాగే బీజేపీ స్పోర్ట్స్ సెల్ (హర్యానా) కో-కన్వీనర్‌గా కూడా ఉన్నారు. వినేష్ ఫోగట్‌ కాంగ్రెస్ నుంచి జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెపై బలమైన అభ్యర్థి యోగేష్ అని కమలం పార్టీ భావించింది.

బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో ఇద్దరు ముస్లిం అభ్యర్థులకు కూడా సీట్లు కేటాయించడం విశేషం. ఫిరోజ్‌పూర్ ఝిర్కా నుంచి నసీమ్ అహ్మద్, పునాహనా నుంచి ఐజాజ్ ఖాన్ జాబితాలో ఉన్నారు. బీజేపీ మొత్తం ఇప్పటి వరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా రెండు స్థానాలకు అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండగా.. ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి:Devara: దేవర దిగాడు.. వయలెన్స్ ఓవర్ లోడెడ్.. ట్రైలర్ అదిరింది చూశారా?

Show comments