Site icon NTV Telugu

BJP: ప్రధానిని విమర్శించిన బీజేపీ మైనారిటీ మోర్చా నేతపై వేటు..

Bjp

Bjp

BJP: కాంగ్రెస్ మేనిఫెస్టో, రాహుల్ గాంధీ చేసిన ‘సంపద పునర్విభజన’ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత ఆదివారం రాజస్థాన్ బన్స్వారాలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ‘‘ మన సంపదను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చొరబాటుదారులు, పిల్లలు ఎక్కువ ఉన్నవారికి ఇవ్వాలని చూస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో ఈ దేశ సంపదపై తొలి హక్కు ముస్లింలకే ఉందనే వ్యాఖ్యల్ని మోడీ ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన తల్లలు, సోదరీమణుల మంగళసూత్రాలు, బంగారాన్ని కూడా లాక్కుంటుందని వ్యాఖ్యానించారు.

Read Also: Heatwave effect: బీహార్‌లో పోలింగ్ సమయం పెంచిన ఈసీ.. ఎన్ని గంటలంటే..!

దీనిపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజస్థాన్ బికనీర్‌కి చెందిన మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉస్మాన్ ఘనీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ వ్యాఖ్యల్ని విమర్శించారు. అయితే, ప్రధానిపై విమర్శలు చేసిన అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ఘనీ, రాజస్థాన్‌లోని 25 సీట్లలో బిజెపి మూడు-నాలుగు లోక్‌సభ స్థానాలను కోల్పోతుందని అన్నారు.

ఎన్నికల ర్యాలీలో ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. ముస్లింల సంబంధించి ప్రధాని మోదీ వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు, ఘనీ మాట్లాడుతూ, ముస్లిం అయినందున, ప్రధాని చెప్పినదానిపై నిరాశ చెందానని చెప్పారు. తాను బీజేపీ తరుపున ఓట్లు అడిగేందుకు వెళ్లినప్పుడు ముస్లిం ప్రశ్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీపై జాట్ సామాజిక వర్గం ఆగ్రహంగా ఉందని, చురు తదితర ప్రాంతాల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారని చెప్పారు. తాను మాట్లాడిన మాటలపై పార్టీ చర్యలు తీసుకుంటే భయపడేది లేదని చెప్పారు. దీనిపై బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ ఓంకార్ సింగ్ లఖావత్ మాట్లాడుతూ.. ఘనీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడారని అన్నారు. అతని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి, ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు.

Exit mobile version