Site icon NTV Telugu

బీజేపీకి శివ‌సేన ద‌గ్గ‌ర‌వుతుందా? ఫ‌డ్నవిస్ వ్యాఖ్య‌ల‌కు అర్ధం అదేనా?

మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి.  రాజ‌కీయాల్లో ఎవ‌రికి ఎవ‌రూ శ‌తృవులు కాదు, ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులూ కాదు.  కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఎన్నిక‌ల్లో ఫైట్ చేసిన శివ‌సేన పార్టీ అధికారం కోసం బీజేపీతో తెగ‌తెంపులు చేసుకొని కాంగ్రెస్ పార్టీతో జ‌త‌క‌ట్టింది.  ఇది ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామం.  బీజేపీకి వ్య‌తిరేకంగా శివ‌సేన బ‌య‌ట‌కురావ‌డంతో మ‌రోమాట మాట్లాడ‌కుండా ఉద్ధ‌వ్‌కు జైకొట్టింది కాంగ్రెస్‌.  అయితే, గ‌త కొన్ని రోజులుగా మ‌హా అఘాడి వికాస్‌లో భాగ‌స్వామ్యంగా ఉన్న ఎస్‌సీపీ మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల‌ని చూస్తున్న‌ది.  

Read: మెహ్రీన్ తో పెళ్లి రద్దుపై స్పందించిన భవ్య బిష్ణోయ్‌

దీనికోసం దేశంలోని అనేక పార్టీల‌ను ఒక గొడుగు కింద‌కు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు శ‌రత్ ప‌వార్‌. ఇటీవ‌ల శ‌ర‌త్ ప‌వార్ ఇంట్లో జ‌రిగిన స‌మావేశానికి అటు కాంగ్రెస్‌ కాని, ఇటు శివ‌సేన‌ కాని హాజ‌రుకాలేదు.  ఈ స‌మావేశం త‌రువాత శివ‌సేన బీజేపీని విమ‌ర్శించ‌డం త‌గ్గించేసింది. అటు శివ‌సేనపై కూడా బీజేపీ పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు.  పైగా బీజేపీ నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ చేసిన వ్యాఖ్య‌లు చూస్తే తిరిగి రెండు పార్టీలు ఒక గూటి కింద‌కు వ‌స్తాయా అనే సందేహం క‌లుగుతున్న‌ది.  మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన త‌మ‌కు శ‌తృవు కాదనీ, ఎన్న‌టికీ శివ‌సేన‌ను అలా చూడ‌బోమ‌ని, వారు ఎప్ప‌టికీ మాకు మిత్రులే అని ఫ‌డ్నవిస్ తెలిపారు.  ఈ మాట‌ల‌కు అర్ధం రాబోయో రోజుల్లో రెండు పార్టీలు తిరిగి క‌లిసి ప‌నిచేస్తాయ‌ని చెప్ప‌డమే అని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  అటు కాంగ్రెస్ పార్టీకూడా శివ‌సేన పార్టీని ఆప్త‌మిత్రుడిగా గుర్తించ‌డంలేదు అన్న‌ది వాస్త‌వం.  శివ‌సేన‌కు హిందూత్వ పార్టీగా పేరు ఉండ‌టంతో ఎప్ప‌టికైనా ఆ పార్టీ తిరిగి బీజేపీతో చేతులు క‌లుపుతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.  

Exit mobile version