మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో భారతీయ జనతా పార్టీ ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీని సాధించి, తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ముఖ్యంగా మూడు దశాబ్దాలుగా శివసేన (UBT) కంచుకోటగా ఉన్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) లో బీజేపీ సాధించిన విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ గెలుపు కేవలం ఒక ఎన్నికల విజయం మాత్రమే కాకుండా, మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసిన సంఘటనగా నిలిచిపోయింది. ముంబైతో పాటు నాగ్‌పూర్, పూణే, నాసిక్ వంటి ప్రధాన నగరాల్లో కూడా కమలం వికసించడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
ఈ చారిత్రాత్మక విజయానికి ప్రధాన శిల్పి దేవేంద్ర ఫడ్నవీస్ అని రాజకీయ విశ్లేషకులు ముక్తకంఠంతో కొనియాడుతున్నారు. కేంద్ర నాయకత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి ఆయన ఒక సైన్యాధ్యక్షుడిలా వ్యవహరించారు. మున్సిపల్ ఎన్నికలైనప్పటికీ, వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫడ్నవీస్, రాష్ట్రంలోని ప్రతి మూలకు వెళ్లి ప్రచారాన్ని హోరెత్తించారు. ముఖ్యంగా ముంబైలో ప్రాంతీయ సెంటిమెంట్లను ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాడుకోకుండా ఉండేందుకు ఆయన అనుసరించిన వ్యూహం ఫలించింది. జాతీయ నాయకులను రంగంలోకి దించకుండా, స్థానిక అంశాలు , అభివృద్ధి ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లడం ద్వారా విపక్షాల విమర్శలకు చెక్ పెట్టారు. ఆయన ప్రసంగాల్లోని వాడి, వేడి , సుపరిపాలనపై ఆయన ఇచ్చిన హామీలు ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.
విపక్ష పార్టీల మధ్య ఉన్న అంతర్గత కలహాలు , చీలికలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలీకృతమైంది. శివసేన , ఎన్సీపీ పార్టీలు రెండు వర్గాలుగా చీలిపోవడం వల్ల ఓట్లు భారీగా చీలిపోయాయి, ఇది నేరుగా బీజేపీ అభ్యర్థుల విజయానికి బాటలు వేసింది. దీనికి తోడు, ముంబై , థానే వంటి ప్రాంతాల్లో మరాఠీ ఓటర్లను ఆకర్షించడమే కాకుండా, హిందుత్వ నినాదంతో ఇతర సామాజిక వర్గాలను ఏకీకృతం చేయడంలో ఫడ్నవీస్ సక్సెస్ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం , పటిష్టమైన బూత్ స్థాయి యంత్రాంగాన్ని సిద్ధం చేయడం ద్వారా బీజేపీ ఈ స్థాయి మెజారిటీని సాధించగలిగింది. 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ఏకంగా 19 చోట్ల బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఆ పార్టీ సంస్థాగత బలానికి నిదర్శనం.
ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముంబై వంటి ఆర్థిక రాజధానిలో పట్టు సాధించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక , పరిపాలన యంత్రాంగంపై బీజేపీ తన పట్టును బిగించింది. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వ సామర్థ్యానికి ఈ విజయం ఒక పెద్ద ధృవీకరణగా నిలిచింది. ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండే మహారాష్ట్రలో, జాతీయ పార్టీ అయిన బీజేపీ ఈ స్థాయిలో పుంజుకోవడం ఇతర రాజకీయ పార్టీలకు గట్టి హెచ్చరిక లాంటిదే. సుస్థిరమైన పాలన , అభివృద్ధిని కాంక్షించే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
