Rahul Gandhi: బిల్కిస్ బానో కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గతంలో గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ద్వారా విడుదల చేసిన 11 నిందితులను ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది న్యాయం సాధించిన విజయమని, బీజేపీ మహిళా వ్యతిరేకి అని, నేరస్తులను ప్రోత్సహిస్తోందని ఆరోపించాయి.
తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. బిల్కిస్ బానో అవిశ్రాంత పోరాటం బీజేపీ అహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ విజయంగా అభివర్ణించారు. ఎన్నికల ప్రయోజనాల కోసం న్యాయాన్ని చంపేసే ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని, ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు నేరస్తులను పెంచి పోషిస్తుంది ఎవరనే విషయాన్ని దేశానికి చాటి చెప్పిందని రాహుల్ ఎక్స్(ట్విట్టర్) లో వ్యాఖ్యానించారు. ఆయన సోదరి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా.. చివరకు న్యాయం గెలిచిందనన్నారు. ఇది బీజేకి చెంపదెబ్బ అని టీఎంసీ కామెంట్ చేసింది.
Read Also: Devara: దేవర గ్లింప్స్.. సముద్రం ఎరుపెక్కాలా
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. మహిళా సాధికారిత విషయంలో బీజేపీ చేస్తున్న వాదనల్ని ఇది బహిర్గతం చేసిందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం తమ చేతుల్లోకి అధికారాన్ని తీసుకుని నేరస్తుల్ని అరెస్ట్ చేయకూడదని, అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎందుకు మౌనంగా ఉందని అడగాలనుకుంటున్నానని, ఈ దోషులు విడుదలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎందుకు ఆమోదించిందని అసద్ ప్రశ్నించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బిల్కిస్ బానోకు, ఆమె కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని ఓవైసీ డిమాండ్ చేశారు.
గుజరాత్‌లో 2002 గోద్రా అనంతర అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబ సభ్యులలో ఏడుగురిని హతమార్చిన కేసులో దోషులుగా ఉన్న 11 మందిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేసింది. అటువంటి ఉత్తర్వును ఆమోదించేంత సామర్థ్యం గుజరాత్ ప్రభుత్వానికి లేదని కోర్టు తీర్పు చెప్పింది. ఆగస్టు 15, 2022న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన 11 మంది ఖైదీలు రెండు వారాల్లోగా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని కోరింది. మార్చి 3, 2002న గుజరాత్‌లో గోద్రా రైలు దహనం ఘటన తర్వాత చెలరేగిన అల్లర్ల నుండి పారిపోతున్నప్పుడు బిల్కిస్ బానోపై 21 ఏళ్ల వయసులో అత్యాచారం జరిగింది. ఈ సమయంలో ఆమె ఐదునెలల గర్భవతి. ఆమె కుటుంబంలో ఏడుగురు హత్యకు గురయ్యారు.
