Bihar Politics: బీహార్ పరిణామాలతో షాక్ లో ఉన్న బీజేపీ మంగళవారం కీలక భేటీ నిర్వహిస్తోంది. ఇన్నాళ్లు మిత్రపక్షంగా అధికారంలో ఉన్న జేడీయూ, సీఎం నితీష్ కుమార్ హ్యాండ్ ఇవ్వడంతో ప్రతిపక్షంలో ఉండనుంది. జేడీయూ, ఆర్జేడీ మళ్లీ మహాఘటబంధన్ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా నితీష్ కుమార్, డిఫ్యూటీ సీఎంగా మొత్తంగా కొత్తగా 31 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే బీహార్ పరిణామాలను చర్చిస్తోంది బీజేపీ అధిష్టానం. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడి సమక్షంలో కీలక సమావేశం జరుగుతోంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. నితీష్ కుమార్ జేడీయూ పార్టీ, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చిస్తోంది. రాబోయే కాలంలో బీహార్ రాష్ట్రంలో ఎలా బలపడాలనే విషయంపై చర్చిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ పోరాడాల్సిన అంశాలు, కొత్త బీహార్ బీజేపీ చీఫ్ ఎంపికపై కూడా చర్చ జరుగుతోంది. దీంతో పాటు బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.
Read Also: Chhattisgarh: ఆదర్శంగా ఛత్తీస్‌గఢ్.. స్పెషల్ పోలీస్ యూనిట్ లోకి ట్రాన్స్‌జెండర్లు..
దీంతో పాటు బీజేపీకి కీలకంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో రానున్న 2024 లోక్ సభ వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏర్పడిన మంత్రి వర్గంపై బీజేపీ విమర్శలు కురిపిస్తోంది. ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దగ్గరే ఉంచుకోవడం ద్వారా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు ద్రోహం చేశారని బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాలూ అనారోగ్యాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్జేడీని చీల్చేందుకు నితీష్ కుమార్ ప్రయత్నిస్తారని సంచలన ఆరోపణలు చేశారు.