ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ సాగుతోంది.. ఓవైపు ఎన్డీఏ తరఫున అభ్యర్థిని నిలిపేందుకు భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తుండగా… విపక్షాలు సైతం ఒకే అభ్యర్థిని పోటీకి పెట్టాలన్న ప్లాన్‌లో ముందుకు సాగుతున్నాయి.. అందులో భాగంగా రేపు ఢిల్లీ వేదికగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కీలక భేటీ జరగబోతోంది. మరోవైపు.. ఎన్డీఏ అభ్యర్థి నితీష్ కుమారే అంటూ ప్రచారం సాగుతోంది.. బీహార్ సీఎంను.. ఎన్డీఏ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోకి దింపనుంది అనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.. దీనిపై స్పందించిన నితీష్ కుమార్.. క్లారిటీ ఇచ్చేశారు.
Read Also: Presidential poll: దీదీ సమావేశానికి కేసీఆర్ దూరం.. కారణం అదేనా..?
రాష్ట్రపతి రేసులో నేను లేను అంటూ స్పష్టం చేశారు నితీష్ కుమార్.. నేనెక్కడికీ వెళ్లడంలేదు.. అలా వస్తున్న వార్తలన్నీ నిరాధారం, ఊహాగానాలు మాత్రమే అంటూ కొట్టిపారేశారు బీహార్ ముఖ్యమంత్రి.. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత మంత్రి శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను నితీష్ కుమార్ తోసిపుచ్చారు.. కాగా, రాష్ట్రపతి కావడానికి కావాల్సిన అన్ని సామర్థ్యాలూ నితీష్ కుమార్‌కు ఉన్నాయి.. ఓ బిహారీగా నితీష్ దేశ ప్రథమ పౌరుడు కావాలని తాను కోరుకుంటాను.. ఆయన రేసులో లేనప్పటికీ ప్రతి వ్యక్తి.. నితీష్ కుమార్ రాష్ట్రపతి కావాలనుకుంటారంటూ బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించి.. చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే.
మరోవైపు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. హిస్టరీపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు నితీష్ కుమార్.. నేటి తరం కోసం గత చరిత్ర వైభవాన్ని తిరగరాయాలంటూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నితీష్.. చరిత్రను మార్చి రాయడం ఎలా సాధ్యమవుతుందంటూ మండిపడ్డారు.. అసలు చరిత్రను ఎవరైనా ఎలా మారుస్తారు? అని నిలదీశారు. పాండ్యులు, చోళుల చరిత్ర గురించి రాయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారని ఎదురైన ప్రశ్నికు స్పందించిన నితీష్ కుమార్.. అసలు చరిత్ర అంటే ఏమిటి? దాన్నెలా మారుస్తారు? అని మండిపడ్డారు. గత చరిత్రను ఎవరూ మార్చలేరు.. అదెలా సాధ్యం.. నాకైతే అర్థం కావట్లేదు.. చరిత్ర అంటే చరిత్రే. దానిలో మార్పులుండబోవని స్పష్టం చేశారు.
