NTV Telugu Site icon

Putin Elon Musk: ఎలాన్ మస్క్, పుతిన్ మధ్య రహస్య సంబంధాలు.. వాల్ స్ట్రీట్ సంచలన కథనం..

Putin Elon Musk

Putin Elon Musk

Putin Elon Musk: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. 2022 నుంచి వీరిద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారని తెలిపింది. అయితే వాల్ స్ట్రీట్ కథనంపై ఎలాన్ మస్క్ మౌనం వహించారు. ఇద్దరు కూడా తమ వ్యక్తిగత విషయాల దగ్గర నుంచి ప్రపంచ ఉద్రిక్తతల వరకు అనేక అంశాలపై చర్చించినట్లు నివేదిక వెల్లడించింది. ఒకానొక సమయంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కి అనుకూలంగా తైవాన్‌‌కి స్టా్ర్‌లింక్ శాటిలైట్లను యాక్టివేట్ చేయవద్దని పుతిన్‌ మస్క్‌ని కోరినట్లు పేర్కొంది.

Read Also: Rammohan Naidu: కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్టానికి ఏమి చేస్తాడు.. జగన్ పై ఫైర్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్‌కి అనుకూలంగా మస్క్‌ ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది. అమెరికన్లు ట్రంప్‌కి ఓటేయాలని మస్క్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మస్క్ లాగే ట్రంప్ కూడా పుతిన్‌‌తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే వీటిని ట్రంప్ ఖండించారు. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మస్క్ రష్యాకి స్టార్‌లింక్ టెర్మినల్స్ విక్రయించినట్లు గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, ఆ సమయంలో మస్క్ వీటిని ఖండించారు.

ప్రస్తుతం ఇదే నిజమైతే, పుతిన్‌ మస్క్ మధ్య కొనసాగుతున్న కమ్యూనికేషన్ అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదకరమని నివేదిక పేర్కొంది. స్పేస్ ఎక్స్‌తో సహా మస్క్ వ్యాపారాలు యూఎస్ మిలిటరీ, ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలు కలిగి ఉన్నాయి. అత్యంత సున్నితమైన సమాచారం అతడికి వెళ్లే అవకాశం ఉందని చెప్పింది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. గతేడాది వివిధ ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మస్క్ కంపెనీలు 3 బిలియన్ల ఒప్పందాలు చేసుకున్నాయి. ట్రంప్ గెలిస్తే, అతడి పాలనతో మస్క్‌కి కీలక పాత్ర లభిస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మస్క్, పుతిన్‌తో ఉన్న సంబంధాలను తగ్గించానని, 2022లో తాను పుతిన్‌తో 18 నెలల్లో ఒకసారి మాత్రమే మాట్లాడానని ఎక్స్ వేదికగా వెళ్లడించాడు.