Bhupender Yadav: బీజేపీ కొత్త జాతీయధ్యక్షుడి ఎంపిక కోసం రంగం సిద్ధం చేస్తోంది. సోమవారం, మరో రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించింది. మరో నాలుగు రాష్ట్రాలకు ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ రాజ్యాంగ ప్రకారం, జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు 37 స్టేట్ ఆర్గనైజేషన్స్‌లో కనీసం 19 రాష్ట్రాలలో అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. బీజేపీకి ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులు ఉన్నారు. వీరిలో కొందరు తిరిగి ఎన్నికయ్యారు. మంగళవారం నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఇప్పటికే, నడ్డాకు పలుమార్లు పదవీకాలాన్ని పొడగించారు. అయితే, ఈసారి బీజేపీ కొత్త అధ్యక్షుడిగా పలు పేర్లు వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రులు శివరాజ్ చౌహాన్, నితిన్ గడ్కరీ, మనోహల్ లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి.
అయితే, కొన్ని బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. జాతీయాధ్యక్ష పదవి భూపేంద్ర యాదవ్‌కి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భూపేంద్ర యాదవ్ పలు రాష్ట్రాల్లో ఎన్నికల ఇంచార్జ్‌గా పనిచేశారు. ఈయన పనిచేసిన ప్రతీ రాష్ట్రంలో కూడా బీజేపీ విజయం సాధించింది.
2024లో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా ఈయన ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. మహావికాస్ అఘాడీలో ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీనికి ముందు 2017లో ఉత్తర్ ప్రదేశ్‌కు, 2013లో రాజస్థాన్‌కు, 2014లో మహారాష్ట్రకు, 2014లో జార్ఖండ్, 2020లో బీహార్‌కు బీజేపీ తరుఫున ఎన్నికల బాధ్యుడిగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే భూపేంద్ర యాదవ్‌కి బీజేపీ పగ్గాలు అప్పచెబుతారనే ప్రచారం నడుస్తోంది.
