అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా బెంగళూరు, ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక సోమవారం కురిసిన కుండపోత వర్షానికి ఇప్పటికే బెంగళూరు నగరం అతలాకుతలం అయింది. అలాగే మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఆర్థిక రాజధాని ముంబై కూడా నీట మునిగింది.
తాజాగా కేంద్ర వాతావరణ శాఖ బెంగళూరుకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం బెంగళూరులో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని 7 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Mumbai Rain: ముంబైను ముంచెత్తిన కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం
ఇప్పటికే బెంగళూరు నగరం మునిగిపోయింది. ఇంతలోనే మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్ -1533ను ఉపయోగించుకోవాలని పౌర సంస్థ సూచించింది.
ఇది కూడా చదవండి: Iran-Israel: మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య టెన్షన్.. అణు కేంద్రాలపై దాడికి ఐడీఎఫ్ ప్లాన్!
ఇదిలా ఉంటే కర్ణాటకలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో నగరం తీవ్ర జలమయం అయింది. ఆస్తి నష్టం, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. బెంగళూరులో సిల్క్ బోర్డ్ జంక్షన్, హోసూర్ రోడ్, బీటీఎం లేఅవుట్ వంటి ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగి వాహనాలు నిలిచిపోయాయి. ఇక వర్షాలు కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు.
బీజేపీ విమర్శ..
ఇదిలా ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా హస్తం నేతలు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నేతలు హాజరయ్యారు. ఈ వేడుకలపై బీజేపీ ధ్వజమెత్తింది. ఓ వైపు భారీ వర్షాలతో నగరం అతలాకుతలం అయి ప్రాణాలు పోతుంటే.. కాంగ్రెస్ నేతలు వేడుకలు జరుపుకుంటారా? అని కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుఫాన్..
ఇదిలా ఉంటే అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ మే 21న తీరం దాటే అవకాశం ఉంది. అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే రోజల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో బెంగళూరు మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఇక ఐటీ కంపెనీలు.. ఉద్యోగుల్ని ఇంటి నుంచి పని చేయాలని సూచించాయి.
