NTV Telugu Site icon

Bengaluru mall: ధోతీ కట్టిన రైతు పవర్.. బెంగళూర్ మాల్‌ మూసివేత..

Bengaluru Gt Mall

Bengaluru Gt Mall

Bengaluru mall: ధోతీ ధరించిన రైతుని మాల్‌కి నిరాకరించిన బెంగళూర్ ఘటన యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ధోతీ ధరించాడని చెబుతూ రైతుని, అతని కొడుకుని సినిమా టిక్కెట్లు ఉన్నప్పటికీ జీటీ మాల్‌లోకి అనుమతించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చివరకు మాల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. ఇదిలా ఉంటే రైతు సంఘాల నుంచి నిరసనలు రావడం, ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో అధికారులు మాల్‌పై చర్యలకు ఉపక్రమించారు.

రైతుకు ఎంట్రీ నిరాకరించిన మాల్‌ యజమాని, సెక్యూరిటీ గార్డుపై కేసు నమోదైంది. పోలీసులు చర్యలు తీసుకోకుండా ఆందోళకు దిగుతామని రైతు నాయకులు హెచ్చరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి, తాత్కాలికంగా మాల్‌ని మూసేశారు. వారం రోజుల పాటు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. జీటి మాల్ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకిత్తించిన తర్వాత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Read Also: UTTAR PRADESH: రాజకీయ దుమారంగా మారిన “కన్వర్ యాత్ర” రూల్స్.. ‘‘యాంటీ ముస్లిం’’ అంటూ విమర్శలు..

అసలేం జరిగింది..?

కర్ణాటక హవేరీ జిల్లాకు చెందిన ఫకీరప్ప అనే రైతు తన కొడుకును చూసేందుకు బెంగళూర్ వచ్చారు. అయితే, తన తండ్రిని సినిమాకు తీసుకెళ్లేందుకు కొడుకు టిక్కెట్లు బుక్ చేసుకుని, జీటీ మాల్‌లోని థియేటర్‌కి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ధోతీ ధరించిన కారణంగా మాల్‌లో తండ్రికొడుకుల్ని అనుమతించలేదు. తమ వద్ద టికెట్లు ఉన్నాయని చెప్పినప్పటికీ నిర్వాహకులు ససేమిరా అన్నారు. లోపలికి వెళ్లాలంటే ప్యాంట్ వేసుకోవాలని రైతుకు సూచించారు. దీని సంబంధించిన వీడియో వైరల్ అయింది.

బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో, ధోతి ధరించినందుకు రైతులను దుర్భాషలాడుతున్నారు, అవమానిస్తున్నారు? మాల్‌లోకి ప్రవేశం నిషేధించబడింది! కర్నాటక సీఎం ధోతీ ధరిస్తారు! ధోతీ మాకు గర్వకారణం.. మాల్‌లో రైతు టక్సీడో ధరించాలా?’’ అంటూ ట్వీట్ చేశారు. డీజిల్ ధరలను పెంచి రైతులకు ద్రోహం చేశారు. ఇప్పుడు ధోతీ ధరించిన రైతుని అవమానించారు. రాహుల్ బాబా ఎక్కడ..? అని ప్రశ్నించారు. ఇదేనా కిసాన్ కే సాథ్ న్యాయ్..? అంటూ అడిగారు.

Show comments