NTV Telugu Site icon

Amit Shah: బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగినప్పుడే బెంగాల్‌లో శాంతి..

Amit Shah

Amit Shah

Amit Shah: బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు అక్రమ వలసలు రెండు దేశాల మధ్య శాంతియుత సంబంధాలకు విఘాతం కలిగిస్తాయని, సరిహద్దు చొరబాట్లను ఆపినప్పుడే పశ్చిమ బెంగాల్‌లో శాశ్వత శాంతి నెలకొంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పెట్రాపోల్ ల్యాండ్ పోర్ట్‌లో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనం, కార్గో గేట్ ప్రారంభించిన సందర్భంగా అమిత్ చేశారు. 2026లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారం చేపడితే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని అరికట్టవచ్చని చెప్పారు.

Read Also: Hyderabad Metro: రాబోయే నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ పూర్తి?

“సరిహద్దులు దాటడానికి చట్టబద్ధమైన మార్గం లేనప్పుడు, అక్రమ వలసలు జరుగుతాయి. అక్రమ వలసలు ఇండో-బంగ్లాదేశ్ శాంతికి హాని కలిగిస్తాయి. నేను బెంగాల్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, 2026 లో బీజేపీని గెలిపించండి. చొరబాట్లను మేము ఆపేస్తాం. చొరబాట్లు ఆగితేనే బెంగాల్‌లో శాంతి నెలకొంటుంది’’ అని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ల్యాండ్ పోర్ట్‌లు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ మరియు సంబంధాలను మెరుగుపరచడంలో ల్యాండ్ పోర్ట్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, ఇవి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను కూడా మెరుగుపరుస్తాయని చెప్పారు.

బెంగాల్ అభివృద్ధికి ప్రధాని మోడీ పంపిన నిధులను తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. నరేంద్రమోడీ హయాంలో ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో రూ. 56,000 కోట్లు ఇచ్చారని, ఈ నిధులు టీఎంసీ చేతుల్లో వెళ్లాయా..? దీనిపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. 2026లో రాజకీయ మార్పు తీసుకురావాలని అమిత్ షా బెంగాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.