Site icon NTV Telugu

Bengal Violence: ముర్షిదాబాద్ సహా బెంగాల్ 4 జిల్లాల్లో AFSPA చట్టాన్ని విధించాలి..

Afspa

Afspa

Bengal Violence: గత కొన్ని రోజులుగా బెంగాల్‌లో వక్ఫ్ వ్యతిరేక నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్ జిల్లాలో హింస తీవ్రంగా మారింది. ఆందోళనకారుల ముసుగులో పలువురు అల్లర్లకు పాల్పడ్డారు. మమతా బెనర్జీ ముస్లిం బుజ్జగింపు వల్లే ఇలాంటి అల్లర్లు జరుగుతున్నాయని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. 150 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే, ముర్షిదాబాద్‌తో సహా సరిహద్దుల్లో ఉన్న మరో మూడు జిల్లాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) విధించాలని బిజెపి ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహాతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ‘‘బెంగాల్ అంటుకుంటోంది. హిందువులు రక్తసిక్తం అవుతున్నారు. ముర్షిదాబాద్, మాల్డా, నాడియా, దక్షిన 24 పరగణాలు జిల్లాల్లో హిందువులపై దాడి చేస్తున్నారు. ఇళ్లను దోపిడి, ప్రాణాలు కోల్పోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ శాంతిభద్రతల్లో విఫలమైంది. ఒకప్పుడు కాశ్మీరీ పండిట్ల మాదిరిగానే, బెంగాల్ హిందువుల్ని వేటడుతున్నారు. 1958 చట్టంలోని సెక్షన్ 3 కింద AFSPA విధించాలని నేను అమిత్ షాని కోరుతున్నాను’’ అని మహతో అమిత్‌కి లేఖ రాశారు.

Read Also: Amaravati: భూసమీకరణకు కసరత్తు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. మ‌రో 44 వేల ఎక‌రాల భూస‌మీక‌ర‌ణ!?

శాంతిభద్రతలను కాపాడటానికి, ప్రభావిత ప్రాంతాల్లో సాయుధ దళాలకు AFSPA ప్రత్యేక అధికారాలను మంజూరు చేస్తుంది. సెర్చ్ ఆపరేషన్లు, వారెంట్ లేకుండా అరెస్టు చేయడం, బలగాలను ఉపయోగించడం, కొన్ని పరిస్థితులలో చంపడానికి కాల్చులు కూడా జరిపే అధికారాలను ఇస్తుంది. పురూలియా ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో 4 జిల్లాల్లో ఈ చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.

ముర్షిదాబాద్ జిల్లాలోనే 86 కి పైగా హిందూ దుకాణాలు, ఇళ్ళు దోచుకోబడి ధ్వంసం చేయబడ్డాయని, జావనా గ్రామంలో తమలపాకు తోటల్ని తగులబెట్టారని ఆయన చెప్పారు. మాల్డా, నాడియా, సౌత్ 2 పరగణాలలో ఇలాంటి అశాంతి చెలరేగిందని, ఇక్కడ కూడా టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, మతపరమైన అల్లర్లు హిందువుల్ని బలహీనంగా, నోరు మెదపకుండా మార్చాయని ఆయన అన్నారు. ఇద్దరు తండ్రీకొడుకుల్ని చంపిన ఘటనను ఆయన ప్రస్తావించారు. హిందూ సమాజమే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు.

Exit mobile version