Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం

  • బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ!
  • అమరవీరుల దినోత్సవానికి మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
  • షరతు విధించిన కాంగ్రెస్
Bengal

Bengal

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ జూలై 21న అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఆహ్వానించింది. అయితే ఆమె కాంగ్రెస్‌ను వీడటం రాజకీయ తప్పిదమని బహిరంగంగా అంగీకరిస్తేనే ఈ ఆహ్వానానికి నిజమైన అర్థం ఉంటుందని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కోల్‌కతాలోని షహీద్ మినార్ వద్ద జూలై 21 కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన శుభంకర్ సర్కార్.. 1993 జూలై 21 ఉద్యమం యువ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన చారిత్రక పోరాటమని, ఆ చరిత్రను ఎవరూ మార్చలేరని అన్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయకుండా మమతా బెనర్జీ గతంలో తీసుకున్న రాజకీయ నిర్ణయం తప్పేనని అంగీకరించాలని సూచించారు. ‘‘మమతకు నిజంగా ధైర్యం ఉంటే కాంగ్రెస్‌ను వీడటం తప్పు నిర్ణయమని ఒప్పుకోవాలి. షహీద్ మినార్ కార్యక్రమానికి వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించవచ్చు. అలా చేస్తే అది ఆమె రాజకీయ ప్రాయశ్చిత్తంగా నిలుస్తుంది.’’ అని శుభంకర్ సర్కార్ వ్యాఖ్యానించారు.

జూలై 21 ఉద్యమం నేపథ్యం

1993 జూలై 21న అప్పటి యువ కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్న మమతా బెనర్జీ రైటర్స్ బిల్డింగ్ ముట్టడి కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు ఓటర్ ఐడీ కార్డునే ఏకైక గుర్తింపు పత్రంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు కాల్పులు జరపగా 13 మంది కాంగ్రెస్, యువ కాంగ్రెస్ కార్యకర్తలు మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. అనంతరం 1997లో కాంగ్రెస్‌ను వీడి తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించిన మమతా బెనర్జీ ప్రతి ఏడాది జూలై 21ను టీఎంసీ శక్తి ప్రదర్శనగా నిర్వహిస్తూ వచ్చారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గతంగా విభేదాలు పెరిగాయి. తిరుగుబాటు నేత రితబ్రతా బెనర్జీ వర్గం కూడా ఈసారి వేర్వేరుగా జూలై 21 కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మరోవైపు టీఎంసీ సంప్రదాయంగా నిర్వహించే విక్టోరియా హౌస్ సమీపంలోని సభకు పోలీసులు అనుమతి నిరాకరించగా… అనంతరం కలకత్తా హైకోర్టు బిర్లా ప్లానెటోరియం సమీపంలో సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.

కొద్ది వారాల క్రితం ఇండియా కూటమి సమావేశం అనంతరం మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. ప్రతిపక్ష ఐక్యత, బెంగాల్ రాజకీయ పరిస్థితులపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్-టీఎంసీ మధ్య సహకారం కొనసాగుతున్నప్పటికీ.. రాష్ట్ర స్థాయిలో మాత్రం రెండు పార్టీల మధ్య రాజకీయ పోటీ కొనసాగుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. శుభంకర్ సర్కార్ వ్యాఖ్యలు కూడా బెంగాల్ కాంగ్రెస్ స్వతంత్ర రాజకీయ వ్యూహాన్ని ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.